తొలి అడుగు పడింది... జగన్ నిర్ణయాన్ని స్వాగతిస్తున్నా: పవన్ కల్యాణ్

  • తిరుమల పింక్ డైమండ్ పైనా సీబీఐ దృష్టి పెట్టాలి
  • పిఠాపురం విగ్రహాల ధ్వంసంపైనా విచారించాలి
  • దేవాదాయ ఆస్తులకు రక్షణ కల్పించాలన్న పవన్
  • ట్విట్టర్ లో జనసేన అధినేత వరుస ట్వీట్లు
అంతర్వేదిలో రథం దగ్ధం ఘటనపై విచారణను సీబీఐకి అప్పగిస్తూ, ఏపీ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాన్ని జనసేన అధినేత పవన్ కల్యాణ్ స్వాగతించారు. ఈ మేరకు తన ట్విట్టర్ ఖాతాలో ఆయన వరుస ట్వీట్లు పెట్టారు. ఇప్పుడు వేసింది తొలి అడుగు మాత్రమేనని పవన్ అభివర్ణించారు. తిరుమలలో మాయమైందన్నట్టుగా అనుమానిస్తున్న పింక్ డైమండ్ పైనా సీబీఐ దృష్టి సారించాలన్నారు.

 "తొలి అడుగు మాత్రమే... అంతర్వేది సంఘటనలో సీబీఐ దర్యాప్తునకు ఆంధ్రప్రదేశ్  ప్రభుత్వం కోరటం అంటే పరిష్కారం అయినట్టు కాదు, నిందితుల్ని పట్టుకోవటానికి వేసిన తొలి అడుగు మాత్రమే. గౌ. ముఖ్యమంత్రి ‘శ్రీ  జగన్  రెడ్డి’  గారి నిర్ణయాన్ని జనసేన స్వాగతిస్తోంది" అని పవన్ ట్వీట్ చేశారు.

ఆపై, "అంతర్వేది రథం దగ్ధం ఘటనకే సీబీఐ పరిమితం కారాదు. పిఠాపురంలో దేవతా విగ్రహాల ధ్వంసం, కొండబిట్రగుంట రథం దగ్ధం వెనుక ఎవరు ఉన్నారో సీబీఐ నిగ్గు తేల్చాలి. ఈ మూడు దుశ్చర్యలూ ఒకేలా ఉన్నాయి. కాబట్టి పిఠాపురం, కొండబిట్రగుంటల్లోని ఘటనల్నీ సీబీఐ పరిధిలోకి తీసుకువెళ్ళండి" అని డిమాండ్ చేశారు. ఆపై, "ఉభయ గోదావరి జిల్లాల్లో ఉన్న అంతర్వేది ఆలయ భూములు అన్యాక్రాంతమైపోయాయి. ఈ ఆలయమే కాదు రాష్ట్రవ్యాప్తంగా దేవాలయాలు, ధర్మసత్రాల ఆస్తులు ఆన్యులపరమైపోయాయి. వీటి గురించీ సీబీఐ ఆరా తీసి ఎండోమెంట్స్ ఆస్తులకు రక్షణ ఇవ్వాలి" అని ఆయన కోరారు.

"వీటితోపాటు తిరుమల శ్రీవారి పింక్ డైమండ్ గురించీ సీబీఐ ఆరా తీయాలి. ఆ పింక్ డైమండ్ ఏమైపోయినదనే అంశంపై శ్రీ రమణ దీక్షితులు గారు గత ప్రభుత్వ హయాంలోనే సంచలన విషయాలు చెప్పారు. ఆ వజ్రం ఎటుపోయిందో ఆరా తీయాలి. తిరుమల శ్రీవారికి, శ్రీకృష్ణ దేవరాయలవారు ఇచ్చిన ఆభరణాల గురించీ ఆరా తీయాలి" అని పవన్ డిమాండ్ చేశారు.


More Telugu News