అమెరికన్ స్పేస్ క్రాఫ్ట్ కు కల్పనా చావ్లా పేరు!

  • 2003లో జరిగిన ప్రమాదంలో దుర్మరణం
  • సిగ్నస్ ఎయిర్ క్రాఫ్ట్ కు కల్పన పేరు పెట్టిన నార్త్ రాప్ గ్రూమన్
  • కల్పనా చావ్లా సేవలు చరిత్రలో నిలిచిపోతాయని వెల్లడి
2003లో స్పేస్ షటిల్ కొలంబియాలో అంతరిక్షం నుంచి భూమికి తిరిగి వస్తూ, ఘోర ప్రమాదంలో మరణించిన కల్పనా చావ్లా పేరును ఓ కమర్షియల్ కార్గో స్పేస్ క్రాఫ్ట్ కు పెట్టాలని అమెరికన్ సంస్థ నిర్ణయించింది. అంతరిక్షానికి వెళ్లిన తొలి భారత మహిళా ఆస్ట్రోనాట్ గా కల్పనా చావ్లా చరిత్ర సృష్టించిన సంగతి తెలిసిందే. యూఎస్ కేంద్రంగా నడుస్తున్న గ్లోబల్ ఏరోస్పేస్ అండ్ డిఫెన్స్ టెక్నాలజీ సేవల సంస్థ 'నార్త్ రాప్ గ్రూమన్' వచ్చే సంవత్సరం వాణిజ్య రవాణా స్పేస్ క్రాఫ్ట్ గా అంతరిక్షంలోకి పంపనున్న సిగ్నస్ క్యాప్స్యూల్ కు ఎస్ఎస్ కల్పనా చావ్లా అని పేరు పెడుతున్నట్టు సంస్థ తెలిపింది.

ఈ విషయాన్ని తన అధికార ట్విట్టర్ ఖాతాలో తెలియజేసిన నార్త్ రాప్ గ్రూమన్, "మేము ఇవాళ కల్పనా చావ్లాను గౌరవిస్తున్నాం. ఆమె తొలి భారత మహిళా వ్యోమగామిగా నాసాలో చరిత్ర సృష్టించారు. హ్యూమన్ స్పేస్ క్రాఫ్ట్స్ అభివృద్ధిలో ఆమె ఎంతో సేవ చేశారు" అని పేర్కొంది. "ఎన్జీ-14 సిగ్నస్ ఎయిర్ క్రాఫ్ట్ కు కల్పనా చావ్లా పేరును పెట్టడాన్ని నార్త్ రాప్ గ్రూమన్ గర్వంగా భావిస్తోంది. ప్రతి సిగ్నస్ కూ అంతరిక్ష సేవలందించిన వారి పేర్లను పెట్టాలని కూడా నిర్ణయించాం" అని కంపెనీ వెబ్ సైట్ పేర్కొంది.

అంతరిక్షానికి వెళ్లిన భారత మహిళగా కల్పనా చావ్లా పేరు చరిత్రలో నిలిచిపోయింది కాబట్టే ఈ నిర్ణయం తీసుకున్నామని సంస్థ పేర్కొంది. స్పేస్ ప్రోగ్రామ్ లో భాగంగా ఆమె తన ప్రాణాలను పోగొట్టుకున్నారని గుర్తు చేస్తూ, ఆమె సేవలను ఎన్నో తరాలు గుర్తు పెట్టుకుంటాయని కొనియాడింది. ఆమె కొలంబియాలో చేసిన ఆన్ బోర్డ్ రీసెర్చ్, ఆస్ట్రోనాట్ ల ఆరోగ్యం, స్పేస్ ఫ్లయిట్ లో సేఫ్టీపై ఎంతో సమాచారాన్ని ప్రపంచానికి అందించిందని పేర్కొంది.

ఇదిలావుండగా, కల్పనా చావ్లా పేరిట నింగిలోకి వెళ్లనున్న స్పేస్ క్రాఫ్ట్ దాదాపు 3,629 కిలోల బరువున్న సామాన్లను స్పేస్ స్టేషన్ కు చేర్చనుంది. వర్జీనియాలో ఉన్న నాసా వాలోప్స్ ఫ్లయిట్ ఫెసిలిటీ నుంచి ఈ నెల 29న నింగిలోకి ఎగరనుంది. కాగా 1962, మార్చి 17న హర్యానాలోని కర్నాల్ లో జన్మించిన కల్పనా చావ్లా, పంజాబ్ ఇంజనీరింగ్ కాలేజీ నుంచి 1982లో ఎయిరోనాటికల్ ఇంజనీరింగ్ లో బ్యాచ్ లర్ ఆఫ్ సైన్స్ పట్టాను పొందారు.

ఆపై ఉన్నత విద్య నిమిత్తం అమెరికాకు వెళ్లి, 1984లో యూనివర్శిటీ ఆఫ్ టెక్సాస్ నుంచి మాస్టర్స్ డిగ్రీని, 1988లో కొలరాడో యూనివర్శిటీ నుంచి ఏరోస్పేస్ ఇంజనీరింగ్ లో పీహెచ్డీని పొందారు. సింగిల్, మల్టీ ఇంజన్ విమానాలు, సీ ప్లేన్లు, క్లయిడర్లు తదితరాల్లో కమర్షియల్ పైలట్ లైసెన్స్ ను, సర్టిఫైడ్ ఫ్లయిట్ ఇన్ స్ట్రక్టర్ హోదాను పొంది, 1988లో నాసాలో తన కెరీర్ ను ప్రారంభించారు. 1991లో యూఎస్ పౌరసత్వాన్ని పొందిన తరువాత, ఆమె 1994లో నాసా ఆస్ట్రొనాట్ గా ఎంపికయ్యారు.

1996లో తొలిసారిగా అంతరిక్షానికి ఎగిరి చరిత్ర సృష్టించిన ఆమె, రెండో ఎసైన్ మెంట్ గా నవంబర్ 2001లో ఎస్టీఎస్-107 క్రూ మెంబర్ గా ఎన్నికయ్యారు. దాదాపు 80 పరిశోధనలను ఆమె పూర్తి చేశారు. తదుపరి మిషన్ లో భాగంగా ఇదే స్పేస్ క్రాఫ్ట్ లో స్పేస్ కు వెళ్లి, తిరిగి భూమ్మీదకు వస్తున్న సమయంలో జరిగిన ప్రమాదంలో ఆమె అసువులుబాశారు.


More Telugu News