కేంద్ర మార్గదర్శకాల కారణంగా ఇబ్బందులు.. త్వరలో వైద్యశాఖలో 11 వేల పోస్టుల భర్తీ: ఈటల

  • శాసన సభ, మండలిలో మాట్లాడిన మంత్రి ఈటల
  • కరోనా చికిత్సకు లక్షలాది రూపాయలు వసూలు చేయడం కలచివేసిందన్న మంత్రి
  • వెంటిలేటర్‌పై ఉంచి చేసినా లక్ష దాటదన్న ఈటల
కరోనా నేపథ్యంలో వైద్యశాఖకు ప్రభుత్వం మంజూరు చేసిన ఐదు వేల పోస్టులతోపాటు మొత్తం 11 వేల పోస్టులను త్వరలో భర్తీ చేయనున్నట్టు తెలంగాణ వైద్యారోగ్య శాఖ మంత్రి ఈటల రాజేందర్ తెలిపారు. ప్రశ్నోత్తరాల సందర్భంగా సంగారెడ్డి ఎమ్మెల్యే తూర్పు జయప్రకాశ్‌రెడ్డి సంగారెడ్డి వైద్య కళాశాల ఏర్పాటుపై అడిగిన ప్రశ్నకు సమాధానంగా మంత్రి రాజేందర్ మాట్లాడారు. రాష్ట్రంలో 54 ఆసుపత్రులను ఇప్పటికే అప్‌గ్రేడ్ చేశామని, త్వరలోనే మరో 11 వేల నియామకాలు చేబడతామని పేర్కొన్నారు. అసలు పదివేల పోస్టులను భర్తీ చేయాలనుకున్నామని, ఇప్పటికే వాటిలో 4 వేల పోస్టులను భర్తీ చేశామని పేర్కొన్న మంత్రి.. మిగిలిన ఆరువేల పోస్టులతోపాటు తాజాగా ప్రభుత్వం మంజూరు చేసిన ఐదు వేల పోస్టులను త్వరలోనే భర్తీ చేస్తామని హామీ ఇచ్చారు.

వీటిలో వైద్యులతోపాటు ఇతర సిబ్బంది పోస్టులు కూడా ఉన్నాయన్నారు. కేంద్రం తాజా మార్గదర్శకాల వల్ల వైద్య కళాశాలలను ఏర్పాటు చేసుకోలేని పరిస్థితుల్లో ఉన్నామని, సంగారెడ్డిలో ఏర్పాటు చేయాలనుకున్న వైద్య కశాశాలకు కూడా ఇబ్బందులు వస్తున్నాయన్నారు. అయినప్పటికీ ముఖ్యమంత్రి కేసీఆర్ హామీ మేరకు కళాశాల ఏర్పాటుకు చర్యలు తీసుకుంటామని మంత్రి హామీ ఇచ్చారు.

కరోనాపై శాసన మండలిలో జరిగిన స్వల్ప కాలిక చర్చ సందర్భంగా మంత్రి ఈటల మాట్లాడుతూ.. కరోనా సాధారణ చికిత్సకు రూ. 10 వేలు అవుతుందని, ఐసీయూలో ఉంచి చికిత్స అందిస్తే రూ. 50 వేలు, వెంటిలేటర్‌పై ఉంచి చికిత్స అందిస్తే లక్ష రూపాయల వరకు కావచ్చని అన్నారు. కానీ లక్షలాది రూపాయలు వసూలు చేయడం చూసి తాను కలత చెందానని అన్నారు. చికిత్సలో భాగంగా ఇచ్చే ఇంజక్షన్ ధర గరిష్ఠంగా రూ. 32 వేలు ఉంటుందని, అది ఒకటి ఇస్తే సరిపోతుందని అన్నారు. కానీ ఇలా అడ్డగోలుగా వసూళ్లు చేయడంపై కొన్ని కార్పొరేట్ ఆసుపత్రుల యాజమాన్యాలను పిలిపించి హెచ్చరించినట్టు చెప్పారు.


More Telugu News