నాటి సూపర్ హిట్ సినిమా 'జెంటిల్ మేన్'కు సీక్వెల్ నిర్మాణం!

  • అర్జున్, మధుబాల జంటగా వచ్చిన 'జెంటిల్ మేన్'
  • ఈ చిత్రం ద్వారానే దర్శకుడిగా శంకర్ పరిచయం
  • అదే పేరిట తెలుగులో కూడా విడుదలై సూపర్ హిట్ 
  • పాన్ ఇండియా సినిమాగా 'జెంటిల్ మేన్ 2'
జెంటిల్ మేన్.. 1993లో తమిళంలో వచ్చిన ఈ చిత్రం ఒక సంచలనం. తమిళనాట సూపర్ హిట్ కాగా, తెలుగులోకి అదే పేరుతో అనువాదం చేయగా, ఇక్కడా పెద్ద హిట్ అయింది. ప్రముఖ నటుడు అర్జున్, మధుబాల హీరో హీరోయిన్లుగా నటించిన ఈ చిత్రం ద్వారా శంకర్ దర్శకుడిగా పరిచయమయ్యాడు.

ఆ చిత్రం సాధించిన విజయంతో ఆ తర్వాత శంకర్ వరుస విజయాలతో సౌత్ ఇండియాలోని టాప్ డైరెక్టర్లలో ఒకరిగా గుర్తింపు తెచ్చుకున్నాడు. భారీ చిత్రాలకు.. వైవిధ్యంతో కూడిన చిత్రాలకు ఆయన కేరాఫ్ అడ్రస్ అయ్యాడు.

ఇక ఈ చిత్రాన్ని తమిళంలో నిర్మించిన నిర్మాత పేరు కె.టి.కుంజుమోన్. ఆ చిత్రం వచ్చిన 27 సంవత్సరాలకు ఇప్పుడు దానికి సీక్వెల్ చేస్తున్నట్టుగా నిర్మాత కుంజుమోన్ ప్రకటించారు. 'జెంటిల్ మేన్ ఫిలిం ఇంటర్నేషనల్' బ్యానర్ పై 'జెంటిల్ మేన్ 2' చిత్రాన్ని నిర్మిస్తున్నట్టు ఆయన ఈ రోజు ప్రకటించారు.

పాన్ ఇండియా ఫిలింగా దీనిని తెలుగు, తమిళ, హిందీ భాషల్లో భారీ బడ్జెట్టుతో నిర్మిస్తున్నట్టు పేర్కొన్నారు. అయితే, దీనికి కూడా శంకర్ దర్శకత్వం వహిస్తాడా? లేక మరొకరు వహిస్తారా? అన్నది ఇంకా వెల్లడికాలేదు. అలాగే, హీరో హీరోయిన్లు ఎవరన్నది కూడా తెలియాల్సివుంది.    


More Telugu News