రికార్డు స్థాయిలో పెరిగిన రిలయన్స్ షేర్.. రూ. 14.67 లక్షల కోట్లు దాటిన మార్కెట్ వాల్యూ!

  • రిలయన్స్ రిటైల్ లో భారీ పెట్టుబడులు పెట్టనున్న సిల్వర్ లేక్
  • దూసుకుపోతున్న రిలయన్స్ షేర్
  • ప్రస్తుతం రూ. 2,313 వద్ద ట్రేడ్ అవుతున్న షేర్
ఈనాటి స్టాక్ మార్కెట్ ట్రేడింగ్ లో రిలయన్స్ ఇండస్ట్రీస్ దూసుకుపోతోంది. తమ రీటైల్ బిజినెస్ లో ప్రైవేట్ ఈక్విటీ సంస్థ సిల్వర్ లేక్ రూ. 7,500 కోట్ల పెట్టుబడులు పెట్టబోతోందని నిన్న రిలయన్స్ ప్రకటించింది. దీంతో, ఆ సంస్థ షేర్ వాల్యూ అమాంతం పెరిగింది. బీఎస్ఈలో నిన్నటి ముగింపు రూ. 2,161తో పోలిస్తే... ప్రస్తుతం రిలయన్స్ షేర్ మరో రూ. 151 పెరిగి రికార్డు స్థాయిలో రూ. 2,313 వద్ద ట్రేడ్ అవుతోంది. దీంతో ఆ సంస్థ మార్కెట్ క్యాపిటల్ రూ. 14,67,670.76 కోట్లకు పెరిగింది.

మరోవైపు దేశీయ స్టాక్ మార్కెట్లు ఈరోజు భారీ లాభాల్లో ట్రేడ్ అవుతున్నాయి. ప్రస్తుతం సెన్సెక్స్ 533 పాయింట్లు పెరిగి 38,727 వద్ద ట్రేడ్ అవుతోంది. నిఫ్టీ 137 పాయింట్లు లాభపడి 11,417 వద్ద కొనసాగుతోంది. రిలయన్స్, ఏసియన్ పెయింట్స్, ఇన్ఫోసిస్, యాక్సిస్ బ్యాంక్, అల్ట్రాటెక్ సిమెంట్ తదితర కంపెనీలు మార్కెట్లను ముందుండి నడిపిస్తున్నాయి.


More Telugu News