మూడు రాజధానుల ఏర్పాటులో ఎలాంటి తప్పు లేదు: మరోసారి తేల్చిచెప్పిన కేంద్రం

  • ఒక రాజధాని మాత్రమే ఉండాలని విభజన చట్టంలో లేదు
  • మూడు రాజధానుల అంశంలో జోక్యం చేసుకోలేం
  • రాజధాని నిర్మాణానికి సాయం చేస్తామని మాత్రమే మేము చెప్పాం
మూడు రాజధానుల అంశం రాష్ట్ర పరిధిలోని విషయమని కేంద్ర ప్రభుత్వం మరోసారి తేల్చి చెప్పింది. ఆంధ్రప్రదేశ్ విభజన చట్టంలో ఒక రాజధాని మాత్రమే ఉండాలని ఎక్కడా లేదని స్పష్టం చేసింది. విభజన చట్టం ప్రకారం మూడు రాజధానులను ఏర్పాటు చేసుకోవడంలో ఎలాంటి తప్పు లేదని చెప్పింది. మూడు రాజధానుల అంశంలో తాము జోక్యం చేసుకోలేమని తెలిపింది.

మూడు రాజధానుల అంశంపై ఇదే విషయాన్ని వెల్లడిస్తూ ఏపీ హైకోర్టులో ఇప్పటికే కేంద్రం రెండు సార్లు అఫిడవిట్ దాఖలు చేసింది. తాజాగా మరో అదనపు అఫిడవిట్ దాఖలు చేసింది. మూడు రాజధానులను అడ్డుకోగలిగే అధికారం కేంద్రానికి ఉందనేది పిటిషనర్ దోనె సాంబశివరావు అపోహ మాత్రమేనని తెలిపింది. ఏపీ రాజధాని నిర్మాణానికి సాయం చేస్తామని మాత్రమే తాము చెప్పిమని వెల్లడించింది. అమరావతే ఏపీ రాజధాని అని కూడా తాము ఎక్కడా చెప్పలేదని స్పష్టం చేసింది. అమరావతిలో హైకోర్టు ఉన్నంత మాత్రాన... అమరావతినే రాజధాని అని చెప్పలేమని తెలిపింది. రాజధాని ఏర్పాటు రాష్ట్ర ప్రభుత్వ అంతిమ నిర్ణయమని చెప్పింది.

కేంద్ర ప్రభుత్వ తాజా అఫిడవిట్ తో రాష్ట్ర ప్రభుత్వానికి ఊరట లభించినట్టయింది. మూడు రాజధానులకు తాము కట్టుబడి ఉన్నామని చెపుతున్న రాష్ట్ర ప్రభుత్వం... ఇకపై ఈ విషయంలో మరింత పక్కా ప్రణాళికతో ముందుకు వెళ్లే అవకాశం ఉంది.


More Telugu News