తనను ధోనీతో పోల్చుకున్నాడు... రిషబ్ పంత్ పై మాజీ సెలక్టర్ ఎంఎస్కే ప్రసాద్ సంచలన వ్యాఖ్యలు!

  • రిషబ్ పంత్ లో ఓవర్ కాన్ఫిడెన్స్
  • స్వీయ ఆటతీరును మరచిపోతున్నాడు
  • చాలాసార్లు చెప్పానన్న ప్రసాద్
గత నెల 15వ తేదీన తాను అంతర్జాతీయ క్రికెట్ నుంచి విరమించుకుంటున్నానని ఎంఎస్ ధోనీ ప్రకటించిన తరువాత, ఆ స్థానాన్ని ఆక్రమించాలని రిషబ్ పంత్ భావిస్తూ, తనను తాను ధోనీతో పోల్చుకుంటున్నాడని మాజీ చీఫ్ సెలక్టర్ ఎంఎస్కే ప్రసాద్ సంచలన వ్యాఖ్యలు చేశారు. ధోనీ స్థానాన్ని ఆక్రమించాలని భావిస్తున్న ఈ యంగ్ క్రికెటర్, తన అంతర్జాతీయ క్రికెట్ ను విజయవంతంగా ప్రారంభించి, టెస్టులు, వన్డేల్లో కీపింగ్ చేస్తున్న సంగతి తెలిసిందే. అయితే, తన అత్యుత్సాహం, ఓవర్ కాన్ఫిడెన్స్ తో రిషబ్ పంత్, తన ఆటను మరచిపోతున్నాడని ప్రసాద్ వ్యాఖ్యానించారు.

తాజాగా ఎంఎస్కే ప్రసాద్ 'స్పోర్ట్స్ కేడియా'కు ఇంటర్వ్యూ ఇస్తూ, తనంతట తానుగా ఎదగాలే తప్ప, ధోనీ వంటి ఆటగాడితో పోల్చుకోవద్దని రిషబ్ కు సూచించారు. "రిషబ్ పంత్ ఎప్పుడు మైదానంలోకి దిగినా, ఎంఎస్ ధోనీతో తనను తాను పోల్చుకుంటాడు. అదే అతనికి చాలాసార్లు మైనస్ అవుతోంది. ఈ విషయంలో నేను కూడా చాలాసార్లు రిషబ్ తో మాట్లాడాను. మిగతా ఆటగాళ్లతో పోలిస్తే, ధోనీ చాలా విభిన్నమైన ఆటగాడని, అతన్ని అనుకరించడం మానేస్తేనే మంచిదని పంత్ కు మేనేజ్ మెంట్ స్పష్టంగా చెప్పింది" అని ప్రసాద్ వ్యాఖ్యానించారు.

ధోనీని కాపీ చేయాలని పంత్ భావిస్తున్నాడని, అది అతని కెరీర్ ను దెబ్బతీస్తుందని అభిప్రాయపడ్డ ప్రసాద్, ధోనీ నీడలో నడవాలన్న తన ఆలోచనను రిషబ్ వదిలేయాలని, స్వయంగా ఎదగాలని సూచించారు.


More Telugu News