ఆలయాలపై దాడులకు నిరసనగా... గాంధేయ పద్ధతిలో రఘురామకృష్ణరాజు దీక్ష
- ఈ నెల 11న ఢిల్లీలో ఒక్క రోజు దీక్ష
- తన నివాసంలో దీక్ష చేపట్టనున్న ఎంపీ
- అందరూ మద్దతు ఇవ్వాలని విజ్ఞప్తి
రాష్ట్రంలో హిందూ దేవాలయాలపై వరుసగా దాడులు జరుగుతున్న నేపథ్యంలో తాను ఒక్క రోజు దీక్ష చేపడుతున్నానంటూ నరసాపురం ఎంపీ రఘురామకృష్ణరాజు వెల్లడించారు. హిందూ దేవాలయాల పరిరక్షణ కోసం ఈ నెల 11వ తేదీన దీక్ష చేస్తున్నానని ఓ ప్రకటన విడుదల చేశారు. ఢిల్లీలో గాంధేయ పద్ధతిలో ఈ దీక్ష ఉంటుందని, ఉదయం 9 గంటల నుండి సాయంత్రం 5 గంటల వరకు దీక్ష కొనసాగిస్తానని వివరించారు. కరోనా నేపథ్యంలో రఘురామకృష్ణరాజు ఈ దీక్షకు వేదికగా తన నివాసాన్నే ఎంచుకున్నారు. ప్రతి ఒక్కరూ తన దీక్షకు మద్దతు ఇవ్వాలని ఆయన విజ్ఞప్తి చేశారు.