లాక్ డౌన్ రూపంలో పేదలకు, అవ్యవస్థీకృత రంగానికి మరణశాసనం రాశారు: మోదీపై రాహుల్ విసుర్లు

  • 21 రోజుల్లో కరోనాను నివారించలేకపోయారన్న రాహుల్
  • లాక్ డౌన్ ను పేదలపై జరిగిన దాడితో పోల్చిన వైనం
  • దేశ యువత భవిష్యత్ పై జరిగిన దాడి అంటూ వ్యాఖ్యలు
దేశంలో కరోనా కారణంగా అస్తవ్యస్త పరిస్థితులు ఏర్పడ్డాయంటూ కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ ప్రధాని నరేంద్ర మోదీపై ధ్వజమెత్తారు. కరోనా వైరస్ ను 21 రోజుల్లో తరిమివేస్తామంటూ హామీ ఇచ్చిన ప్రధాని నరేంద్ర మోదీ, ఇచ్చిన మాట నిలబెట్టుకోకపోగా, లాక్ డౌన్ రూపంలో పేదవాళ్లపైనా, అవ్యవస్థీకృత రంగాలపైనా మరణశాసనం లిఖించారంటూ ఆరోపించారు.

లాక్ డౌన్ అనేది కరోనా వైరస్ పై దాడి కాదని, లాక్ డౌన్ అనేది భారతదేశంలోని పేదవాళ్లపై జరిగిన దాడి అని విమర్శించారు. ఇది మన దేశ యువతకు చెందిన భవిష్యత్తుపై జరిగిన దాడి అని అభివర్ణించారు. లాక్ డౌన్ దాడి కారణంగా కార్మికులు, రైతులు, చిన్న దుకాణదార్లు అందరూ నష్టపోయారని, ఈ దాడికి వ్యతిరేకంగా అందరూ ముందుకు కదలాల్సిన అవసరం ఉందని రాహుల్ గాంధీ పేర్కొన్నారు. కరోనా పేరుతో ఏదైతే చేశారో అది అవ్యవస్థీకృత రంగంపై జరిగిన మూడో దాడి అని అన్నారు. ఈ మేరకు రాహుల్ ఓ వీడియోను విడుదల చేశారు.


More Telugu News