జైల్లో తన ప్రాణాలకు ముప్పు ఉందంటూ బెయిల్ కోరిన రియా

  • సుశాంత్ కేసులో డ్రగ్స్ కోణం
  • రియాను అరెస్ట్ చేసిన ఎన్సీబీ అధికారులు
  • 14 రోజుల రిమాండ్
  • గతరాత్రి రియా బెయిల్ పిటిషన్ ను కొట్టివేసిన కోర్టు
  • తాజాగా మరోసారి బెయిల్ పిటిషన్ దాఖలు
సుశాంత్ సింగ్ రాజ్ పుత్ వ్యవహారంలో డ్రగ్స్ కోణంపై దర్యాప్తు చేస్తున్న నార్కోటిక్స్ కంట్రోల్ బ్యూరో (ఎన్సీబీ) అధికారులు నటి రియా చక్రవర్తిని అరెస్ట్ చేయడం తెలిసిందే. ఆమెకు 14 రోజుల రిమాండ్ విధించారు. అయితే, జైల్లో తన ప్రాణాలకు ముప్పు ఉందంటూ రియా మరోసారి బెయిల్ కు దరఖాస్తు చేశారు.

రియాను మంగళవారం అరెస్ట్ చేసిన ఎన్సీబీ అధికారులు కోర్టు ఎదుట హాజరుపరచగా, 14 రోజుల జ్యుడిషియల్ కస్టడీ విధించారు. దాంతో అధికారులు ఆమెను ముంబయిలోని బైకుల్లా కారాగారానికి తరలించారు. రియా గతరాత్రే బెయిల్ కోసం పిటిషన్ దాఖలు చేయగా, మేజిస్ట్రేట్ కోర్టు కొట్టివేసింది. దాంతో ఆమె ఇవాళ తన న్యాయవాది ద్వారా ఎన్డీపీఎస్ న్యాయస్థానంలో తాజాగా బెయిల్ కోసం దరఖాస్తు చేసుకున్నారు.

రియా వైపు బెయిల్ ఇవ్వదగిన కారణాలు ఉన్నాయని ఆమె తరఫు న్యాయవాది సతీశ్ మానే షిండే పేర్కొన్నారు. ఈ బెయిల్ పిటిషన్ పై రేపు విచారణ జరగనుంది. ఇదే కేసులో ఇప్పటికే అరెస్టయిన రియా సోదరుడు షోవిక్ కూడా బెయిల్ పిటిషన్ దాఖలు చేశాడు.


More Telugu News