గండికోట ప్రాజెక్టు నిర్వాసితులకు 15 నెలలలో ఎంత పరిహారం చెల్లించారు?: దేవినేని ఉమ

  • గండికోటముంపు ప్రాంతాల్లో నిర్వాసితుల ఆందోళన
  • పరిహారం చెల్లించాల‌ని నిర‌స‌న‌లు
  • ఎన్ని ఇళ్లు నిర్మించారు?
ఆంధ్ర‌ప్ర‌దేశ్ ముఖ్య‌మంత్రి వైఎస్ జగన్‌ సొంత జిల్లా కడపలో గండికోట ప్రాజెక్టు ముంపు గ్రామాల బాధితులు రోడ్డెక్కి ఆందోళ‌న‌ల్లో పాల్గొంటున్న దృశ్యాల‌ను టీడీపీ నేత దేవినేని ఉమామ‌హేశ్వ‌ర‌రావు త‌న ట్విట్ట‌ర్ ఖాతాలో పోస్ట్ చేశారు.

గాలేరు-నగరి సుజల స్రవంతి ప్రాజెక్టులో భాగంగా కొండాపురం మండలంలో గండికోట జలాశయం నిర్మించగా ఇందులో ముంపునకు గురైన ప‌లు గ్రామాలను ఇప్పటికే ఖాళీ చేయించారని, అయితే పరిహారం పంపిణీ చేయలేదని ఆయా ప్రాంతాల‌ మ‌హిళ‌లు తెలిపారు. పునరావాస కాలనీల్లో కనీస సౌకర్యాలు కల్పించడం లేద‌ని ఆవేద‌న వ్య‌క్తం చేశారు. ఈ విష‌యాల‌కు సంబంధించిన వీడియోల‌ను పోస్ట్ చేస్తూ, దీనికి స‌మాధానం చెప్పాల‌ని జ‌గ‌న్ ను దేవినేని ఉమ డిమాండ్ చేశారు.

"ముఖ్యమంత్రి సొంత జిల్లాలో గండికోట ముంపు ప్రాంతాల్లో పరిహారం కోసం నిర్వాసితుల ఆందోళన.. తెలుగుదేశం పార్టీ హయాంలో గండికోట నిర్వాసితులకు పరిహారం చెల్లించి, 12టీఎంసీల నీరు నిలబెట్టి, పులివెందులకు నీళ్లిచ్చిన చరిత్ర చంద్ర‌బాబు నాయుడిది. 15 నెలలలో నిర్వాసితులకు ఎంత పరిహారం చెల్లించారు? ఎన్ని ఇళ్లు నిర్మించారు? చెప్పండి వైఎస్ జ‌గ‌న్ గారూ?"  అని దేవినేని ఉమామ‌హేశ్వ‌ర‌రావు డిమాండ్ చేశారు.



More Telugu News