తనకు హిట్ ఇచ్చిన దర్శకుడికి లగ్జరీ రేంజ్ రోవర్ ను గిఫ్ట్ గా ఇచ్చిన హీరో నితిన్!

  • నేడు వెంకీ కుడుముల పుట్టినరోజు
  • 'భీష్మ'తో నితిన్ కు ఈ ఏడు మంచి హిట్
  • శుభాభినందనలు తెలుపుతూ బహుమతిగా కారు
దాదాపు నాలుగు సంవత్సరాల తరువాత 'భీష్మ'తో తనకు హిట్ ఇచ్చిన వెంకీ కుడుములకు హీరో నితిన్ ఖరీదైన రేంజ్ రోవర్ లగ్జరీ కారును బహుమతిగా ఇచ్చాడు. నేడు వెంకీ పుట్టిన రోజు కాగా, స్వయంగా ఆయనింటికి వెళ్లి, కారును ఇచ్చిన నితిన్, శుభాభినందనలు తెలిపాడు. ఈ సంవత్సరం ఫిబ్రవరిలో నితిన్, రష్మిక జంటగా వచ్చిన 'భీష్మ' మంచి హిట్ గా నిలిచిన సంగతి తెలిసిందే. తనకు నాలుగేళ్ల తరువాత వెంకీ సహకారంతో మంచి హిట్ వచ్చిందని నితినే స్వయంగా చెప్పుకున్న సంగతి తెలిసిందే.

ఇక ఈ రేంజ్ రోవర్ కారు ధర సుమారు రూ. 1 కోటికి పైగానే ఉంటుంది. ఇంత ఖరీదైన కారును తనకు గిఫ్ట్ గా ఇవ్వడంపై వెంకీ కూడా ఆనందాన్ని వ్యక్తం చేశాడు. "మంచి వారితో మంచి సినిమాలు చేస్తే, ఫలితం ఇలానే ఉంటుంది. అత్యుత్తమ బహుమతి ఇచ్చినందుకు కృతజ్ఞతలు" అంటూ వెంకీ తన ట్విట్టర్ ఖాతాలో వ్యాఖ్యానించాడు.

'భీష్మ' తరువాత రామ్ చరణ్ హీరోగా ఓ సినిమాను నిర్మించేందుకు వెంకీ సిద్ధమవుతున్న సంగతి తెలిసిందే. ఇప్పటికే స్టార్ డైరెక్టర్ గా పేరు తెచ్చుకున్న వెంకీ, 'ఆర్ఆర్ఆర్' షూటింగ్ నుంచి రామ్ చరణ్ బయటకు రాగానే, తన చిత్రాన్ని పట్టాలెక్కించాలన్న ఆలోచనలో చకచకా ఏర్పాట్లు చేసుకుంటున్నారు.


More Telugu News