సందేహాలు ఉన్నాయి.. కంగనకు మద్దతుగా ఉంటాం: ముంబై బీజేపీ ఎంపీ

  • కంగన కార్యాలయాన్ని కూల్చేస్తామని బీఎంసీ అధికారులు చెప్పారు
  • చట్ట విరుద్ధమైన నిర్మాణమైతే కూల్చేయండి
  • ఎవరికైనా అన్యాయం జరిగితే ఊరుకోబోము
సినీ నటి కంగన రనౌత్ కు ముంబై నార్త్ బీజేపీ ఎంపీ గోపాల్ శెట్టి మద్దతుగా నిలిచారు. కంగనపై బీఎంసీ అధికారులు వ్యవహరిస్తున్న తీరుపై తమకు అనుమానాలు ఉన్నాయని... అందుకే ఆమెకు అండగా ఉంటామని చెప్పారు. కంగన కార్యాలయాన్ని కూల్చేస్తామని నిన్న చెప్పిన అధికారులు... ఈరోజు ఒక నోటీసును అతికించి వెళ్లిపోయారని... ఆఫీసులో జరుగుతున్న పని వల్ల నీరు లీక్ కాకుండా చూసుకోవాలని ఆ నోటీసులో పేర్కొన్నారని తెలిపారు. కంగన పట్ల కార్పొరేషన్ అభ్యంతరకరంగా వ్యవహరిస్తోందని... రేపు తాను ముంబైకి వెళ్తానని, అప్పుడు వ్యక్తిగతంగా ఈ అంశాన్ని పరిశీలిస్తానని చెప్పారు.

ఎవరికైనా ఏ ప్రభుత్వమైనా అన్యాయం చేయాలనుకుంటే తాము చూస్తూ ఊరుకోబోమని గోపాల్ శెట్టి అన్నారు. కంగనను రాష్ట్ర ప్రభుత్వం నేరుగా టార్గెట్ చేసిందా? లేక అధికారుల ద్వారా ఆమెపై కక్ష సాధింపులకు దిగిందా? అనే విషయం తేలాల్సి ఉందని చెప్పారు. ఒకవేళ కంగన కార్యాలయం చట్ట విరుద్ధమైన నిర్మాణమైతే దాన్ని కూల్చివేయవచ్చని... అయితే, ఆమెపై చర్యలకు దిగిన సమయం పలు సందేహాలకు తావిస్తోందని అన్నారు. తాను మూడు పర్యాయాలు కార్పొరేటర్ గా, పదేళ్లు ఎమ్మెల్యేగా ఉన్నానని... గత ఆరేళ్లుగా ఎంపీగా బాధ్యతలను నిర్వహిస్తున్నానని... ఎవరికైనా అన్యాయం జరిగితే ఊరుకోబోనని హెచ్చరించారు.


More Telugu News