జగన్ కేంద్రానికి అనుకూలంగా మారిపోయాడు: సీపీఐ నారాయణ

  • ఉచిత విద్యుత్ ఎత్తేసేందుకే మీటర్లు ఏర్పాటు చేస్తున్నారు
  • వైయస్ పథకాలకు పంగనామాలు పెడుతున్నారు
  • ఎన్నికల హామీలను తుంగలో తొక్కుతున్నారు
ఏపీ ముఖ్యమంత్రి జగన్ పై సీపీఐ జాతీయ కార్యదర్శి నారాయణ విమర్శలు గుప్పించారు. రైతులకు ఉచిత విద్యుత్ ను ఎత్తేసేందుకే విద్యుత్ మీటర్లను ఏర్పాటు చేస్తున్నారని ఆరోపించారు. మాట తప్పను, మడమ తిప్పను అని చెప్పుకునే జగన్... ఈరోజు మాట తప్పారని దుయ్యబట్టరు. తన తండ్రి వైయస్ రాజశేఖరరెడ్డి తీసుకొచ్చిన పథకాలకు జగన్ పంగనామాలు పెడుతున్నారని ఎద్దేవా చేశారు. ఎన్నికల హామీలను తుంగలో తొక్కుతున్నారని అన్నారు.

కేసుల భయంతో కేంద్ర ప్రభుత్వానికి పూర్తి అనుకూలంగా జగన్ మారిపోయారని నారాయణ విమర్శించారు. కేంద్ర ప్రభుత్వం తీసుకుంటున్న నిర్ణయాలతో రాష్ట్రాలకు అన్యాయం జరుగుతోందని చెప్పారు. జీఎస్టీ నిధులను కూడా రాష్ట్రాలకు ఇవ్వడం లేదని విమర్శించారు. కేంద్ర విధానాల పట్ల ముఖ్యమంత్రులు తిరగబడే పరిస్థితి వచ్చిందని అన్నారు. జగన్ మాత్రం కేంద్రానికి అనుకూలంగా వ్యవహరిస్తున్నారని చెప్పారు. కరోనా నియంత్రణలో సైతం కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు విఫలమయ్యాయని మండిపడ్డారు.


More Telugu News