సీఎం కేసీఆర్ సమావేశం నుంచి జలుబు, దగ్గుతో బయటికొచ్చి నేరుగా ఆసుపత్రికి వెళ్లిన ఎమ్మెల్యే!
- తెలంగాణ భవన్ లో టీఆర్ఎస్ ఎల్పీ సమావేశం
- సమావేశం మధ్యలోనే నిష్క్రమించిన కాలే యాదయ్య
- కరోనా నెగెటివ్ ఉంటేనే సభకు రావాలన్న స్పీకర్
తెలంగాణలో ఇప్పటికే అనేకమంది ప్రజాప్రతినిధులు కరోనా వైరస్ ప్రభావానికి గురయ్యారు. ఈ నేపథ్యంలో తాజాగా ఆసక్తికర సంఘటన జరిగింది. అసెంబ్లీ సమావేశాల సందర్భంగా సీఎం కేసీఆర్ ఆధ్వర్యంలో తెలంగాణ భవన్ లో టీఆర్ఎస్ ఎల్పీ భేటీ జరుగుతుండగా, చేవెళ్ల ఎమ్మెల్యే కాలే యాదయ్య ఒక్కసారిగా బయటికి వచ్చేశారు. జలుబు, దగ్గుతో బాధపడుతున్న ఆయన నేరుగా ఆసుపత్రికి వెళ్లారు. అసెంబ్లీ సమావేశాల నేపథ్యంలో ప్రతి ఒక్క సభ్యుడు కరోనా టెస్టులు చేయించుకోవాలని, నెగెటివ్ వస్తేనే సభా సమావేశాలకు హాజరు కావాలని స్పీకర్ పోచారం శ్రీనివాసరెడ్డి ఇటీవలే స్పష్టం చేశారు. కాలే యాదయ్య కూడా కొన్నిరోజుల కిందట కరోనా టెస్టు చేయించుకున్నట్టు తెలుస్తోంది.