ఖాజీపల్లి అర్బన్ ఫారెస్ట్ బ్లాక్ ను దత్తత తీసుకున్న ప్రభాస్

  • ఇటీవలే గ్రీన్ ఇండియా చాలెంజ్ లో మొక్కలు నాటిన ప్రభాస్
  • 1000 ఎకరాల అటవీభూమిని దత్తత తీసుకుంటానని ప్రకటన
  • మాట నిలబెట్టుకున్న ప్రభాస్
పాన్ ఇండియా రేంజికి ఎదిగిన టాలీవుడ్ హీరో ప్రభాస్ తన సామాజిక స్పృహ చాటుకున్నారు. హైదరాబాద్ అవుటర్ రింగ్ రోడ్డుకు దగ్గర్లోని ఖాజీపల్లి అనే గ్రామానికి చెందిన అర్బన్ ఫారెస్ట్ బ్లాక్ ను దత్తత తీసుకున్నారు. ఇటీవలే గ్రీన్ ఇండియా చాలెంజ్ లో భాగంగా మొక్కలు నాటిన ప్రభాస్ ఓ 1000 ఎకరాల అటవీభూమిని దత్తత తీసుకుంటానని ప్రకటించారు. గ్రీన్ ఇండియా చాలెంజ్ సృష్టికర్త సంతోష్ కుమార్ ఎక్కడ చూపిస్తే అక్కడ రిజర్వ్ ఫారెస్ట్ ను అభివృద్ధి చేస్తానని వెల్లడించారు. ఈ మేరకు ఖాజీపల్లి అర్బన్ బ్లాక్ ను దత్తత తీసుకున్నారు. ఈ కార్యక్రమానికి మంత్రి అల్లోల ఇంద్రకరణ్ రెడ్డి, ఎంపీ సంతోష్ కూడా హాజరయ్యారు.

కాగా, ప్రభాస్ 1650 ఎకరాల అటవీభూమిని దత్తత తీసుకున్నట్టు తెలుస్తోంది. ఈ భూమి జిన్నారం మండలం ఓఆర్ఆర్ సమీపంలో ఉంది. ఈ ఫారెస్ట్ రిజర్వ్ భూమిని ప్రభాస్ తన తండ్రి దివంగత యూవీఎస్ రాజు పేరుమీద అర్బన్ పార్క్, అటవీప్రాంతంగా అభివృద్ధి చేయనున్నారు. ఇప్పటికే రూ.2 కోట్లు అందించిన ప్రభాస్, అవసరమైతే మరింత ఖర్చు చేసేందుకు సంసిద్ధత వ్యక్తం చేసినట్టు సమాచారం.


More Telugu News