వైఎస్సార్ సంపూర్ణ పోషణ పథకానికి శ్రీకారం చుట్టిన సీఎం జగన్

  • పిల్లలు, తల్లులకు సంపూర్ణ పోషణ
  • శారీరక, మానసిక ఆరోగ్య ప్రధానంగా సరికొత్త పథకం
  • మానసిక ఆరోగ్యం కూడా ముఖ్యమేనన్న సీఎం జగన్
ప్రజలకు మంచి చేయాలని భావించి తీసుకువచ్చిన పథకాల్లో వైఎస్సార్ సంపూర్ణ పోషణ పథకం ఒకటని సీఎం జగన్ పేర్కొన్నారు. వీడియో కాన్ఫరెన్స్ కార్యక్రమం ద్వారా ఈ పథకాన్ని ఆయన ప్రారంభించారు. ఇలాంటి కార్యక్రమాలతో ఎంతో సంతృప్తి కలుగుతుందని చెప్పారు. గతంలో పిల్లలు ఎత్తుకు తగ్గ బరువు ఉన్నారా, వారి శారీరక, మానసిక ఆరోగ్యం ఎలా ఉంది, తల్లులు సంపూర్ణ ఆరోగ్యంతో ఉన్నారా అనే విషయాలు పెద్దగా ఎవరూ పట్టించుకోలేదని చెప్పారు. చాలీచాలని విధంగా, ఏదో ఇచ్చామంటే ఇచ్చామన్నట్టుగా ఈ తరహా పథకాలకు నిధుల కేటాయింపులు ఉండేవని తెలిపారు.

6 నుంచి 72 నెలల లోపు వయసున్న పిల్లలకు, బిడ్డలకు జన్మనివ్వనున్న మహిళలకు, బాలింతలకు వర్తించేలా ఈ వైఎస్సార్ పోషణ, వైఎస్సార్ పోషణ ప్లస్ కార్యక్రమాలను అమలు చేస్తున్నామని వెల్లడించారు. ఒక కుటుంబం సామాజికంగా, విద్యాపరంగా, ఆర్థికంగా వెనుకబడి ఉంటే, ఆ కుటుంబాల్లో విటమిన్లు, మినరల్స్ లోపంతో ఉన్న పిల్లలు, తల్లులు ఎక్కువగా కనిపిస్తుంటారని తెలిపారు. వారిలో రక్తహీనత, బలహీనత వంటి అనేక ఆరోగ్య సమస్యలు ఎదుర్కొంటుంటారని పేర్కొన్నారు.

గర్భవతుల్లో 53 శాతం మందికి రక్తహీనత ఉన్నట్టు తేలిందని, ఐదేళ్ల వయసు లోపు బాలల్లో తక్కువ బరువుతో ఉన్నవాళ్లు 31.9 శాతం ఉన్నారని వివరించారు. ఐదేళ్ల వయసు లోపు బాలల్లో ఎత్తుకు తగ్గ బరువు లేనివాళ్లు ఎంతమంది అని చూస్తే, 17.2 శాతం అని వెల్లడైందని సీఎం జగన్ తెలిపారు. ఇక వయసుకు తగ్గట్టు ఎత్తు పెరగని పిల్లలు 31.4 శాతం ఉన్నారని చెప్పారు. ఇవన్నీ చూస్తుంటే మన పిల్లలు, తల్లులు ఎంత దుస్థితిలో ఉన్నారో తెలుస్తోందని, గతంలో వీళ్లని పట్టించుకోకుండా వదిలేసినందువల్లే ఈ పరిస్థితి వచ్చిందని అన్నారు.

మన పిల్లలు ఈ పోటీ ప్రపంచంలో ఎలా ఉన్నారు అనే విషయం ఆలోచించి, మార్పు అనేది తీసుకురావాలని నిర్ణయించామని, ఆరోగ్యవంతమైన శరీరం ఉంటే ఆరోగ్యవంతమైన మనసు ఉంటుందని... ఈ రెండింటికి అంతర్గత సంబంధం ఉందని సీఎం జగన్ వివరించారు. నేటి కాలంలో సరిగా చదువుకోని తల్లిదండ్రులు, మూడు పూటలా గుప్పెడు తిండికి నోచుకోని తల్లిదండ్రులు వారి పిల్లలు, వీరందరి జీవితాలలో మార్పులు తీసుకురావాల్సిన అవసరం ఉందని గుర్తించిన పిమ్మటే వైఎస్సార్ సంపూర్ణ పోషణ, వైఎస్సార్ సంపూర్ణ పోషణ ప్లస్ పథకం ఆలోచన చేశామని చెప్పారు.


More Telugu News