26 మందిని కిడ్నాప్ చేసిన మావోయిస్టులు.. నలుగురి హత్య

  • తెలంగాణలో ఉనికి చాటుకునే ప్రయత్నం చేస్తున్న మావోలు
  • నేడు ఉత్తర తెలంగాణ బంద్‌కు పిలుపు
  • కూంబింగ్ ఆపకపోతే తమ చెరలో ఉన్న 16 మందిని చంపేస్తామని హెచ్చరిక
తెలంగాణలో మావోయిస్టులు మళ్లీ తమ ఉనికిని చాటుకునే ప్రయత్నం చేస్తున్నారు. నేడు ఉత్తర తెలంగాణ బంద్‌కు పిలుపునివ్వడంతో ఉద్రిక్తత నెలకొంది. ఈ నెల 3న  గుండాల ఎన్‌కౌంటర్‌లో మావోయిస్టు నేత హరిభూషణ్‌ గన్‌మన్, యాక్షన్‌ టీం కమిటీ సభ్యుడు దూది దేవాల్‌ అలియాస్‌ శంకర్‌ హతమయ్యాడు. ఇది బూటకపు ఎన్‌కౌంటర్‌ అంటూ లేఖలను విడుదల చేసిన మావోయిస్టు ఏరియా, డివిజన్‌ కమిటీ కార్యదర్శులు ఉత్తర తెలంగాణ బంద్‌కు పిలుపునిచ్చారు.

ప్రతీకారం కోసం మావోలు ఎదురుచూస్తుండడంతో ఎప్పుడేం జరుగుతుందో తెలియక టెన్షన్ వాతావరణం నెలకొంది. దీంతో అప్రమత్తమైన పోలీసులు భద్రాద్రి కొత్తగూడెం, ములుగు, జయశంకర్‌ భూపాలపల్లి, పెద్దపల్లి, మంచిర్యాల, ఆసిఫాబాద్, ఆదిలాబాద్‌ జిల్లాల్లో కీలకమైన ప్రాంతాల్లో కూంబింగ్ నిర్వహిస్తున్నారు.

మరోవైపు, డీజీపీ మహేందర్‌రెడ్డి నాలుగు రోజులుగా ఆసిఫాబాద్ జిల్లాలోనే మకాం వేసి సెర్చ్ ఆపరేషన్లు పర్యవేక్షిస్తుండడం కూడా ఏజెన్సీలో ఏదో జరగబోతోందన్న వార్తలకు ఊతమిస్తోంది. ప్రస్తుత ఉద్రిక్త పరిస్థితుల నేపథ్యంలో ఉత్తర తెలంగాణలో హైఅలర్ట్‌ ప్రకటించారు. భద్రాద్రి థర్మల్‌ పవర్‌ స్టేషన్‌ (బీటీపీఎస్‌), సీతారామ ఎత్తిపోతల పథకాలకు పోలీసులు భద్రత పెంచారు. ఇతర రాష్ట్రాల కార్మికులు పనిచేస్తుండటంతో మావోలు వారిలో కలసిపోయే అవకాశం ఉండటంతో పోలీసులు పూర్తి అప్రమత్తంగా ఉన్నారు.


కాగా, చత్తీస్‌గఢ్‌ బీజాపూర్ జిల్లాలోని మోటాపోల్, పునాసార్ గ్రామాలకు చెందిన  26 మందిని ఇన్‌ఫార్మర్ల నెపంతో మావోలు కిడ్నాప్ చేశారు. అనంతరం ప్రజాకోర్టు ఏర్పాటు చేసి నలుగురిని గొంతుకోసి దారుణంగా హతమార్చారు. అనంతరం ఆరుగురిని విడిచిపెట్టిన మావోలు, మరో 16 మందిని మాత్రం తమ చెరలోనే ఉంచుకున్నారు. పోలీసులు కనుక సెర్చ్ ఆపరేషన్లు నిలిపివేయకపోతే తమ వద్ద బందీలుగా ఉన్న 16 మందిని చంపేస్తామని హెచ్చరికలు జారీ చేశారు.


More Telugu News