దేశంలో తగ్గుతున్న మరణాల రేటు.. పెరుగుతున్న రికవరీ శాతం!

  • గత 24 గంటల్లో 86,432 కేసులు వెలుగులోకి
  • 40 లక్షలు దాటిన కేసుల సంఖ్య
  • నిన్న ఒక్క రోజే 1,089 మంది మృతి
దేశంలో కరోనా మరణాల రేటు క్రమంగా తగ్గుతోంది. అదే సమయంలో రికవరీ రేటు పెరుగుతుండడం ఊరటనిస్తోంది. దేశంలో గత 24 గంటల్లో 86,432 కొత్త కేసులు నమోదయ్యాయి. వీటితో కలుపుకుని ఇప్పటి వరకు కరోనా మహమ్మారి బారినపడిన వారి సంఖ్య 40,23,179కి పెరిగింది.

ప్రపంచవ్యాప్తంగా అత్యధిక కేసులు నమోదైన దేశాల జాబితాలో ప్రస్తుతం మూడో స్థానంలో ఉన్న భారత్‌లో కేసుల జోరు ఇలాగే కొనసాగితే బ్రెజిల్‌ను వెనక్కి నెట్టేసి రెండో స్థానానికి ఎగబాకడం ఖాయంగా కనిపిస్తోంది. ప్రస్తుతం బ్రెజిల్‌లో 40,91,801 కేసులు నమోదయ్యాయి. భారత్‌లో ఆ సంఖ్య 40,23,179గా ఉంది. అంటే రెండు దేశాల మధ్య తేడా 68,622 మాత్రమే. కాగా, నిన్న కరోనా కారణంగా 1,089 మంది మృతి చెందారు. ఫలితంగా దేశంలో ఇప్పటి వరకు 69,561 మంది ప్రాణాలు కోల్పోయారు.

మొత్తం బాధితుల్లో 8,46,395 మంది వివిధ ఆసుపత్రులలో చికిత్స పొందుతుండగా, 31,07,223 మంది కోలుకున్నారు. దేశంలో కరోనా రికవరీ రేటు 77.23 శాతంగా ఉండగా, మరణాల రేటు 1.73 శాతానికి తగ్గడంతో అధికారులు ఊపిరిపీల్చుకున్నారు. దేశవ్యాప్తంగా ఇంకా 8,46,395 కేసులు యాక్టివ్‌గా ఉన్నాయి. ఇక దేశవ్యాప్తంగా నిన్న 10,59,346 మందికి కొవిడ్ పరీక్షలు నిర్వహించారు.


More Telugu News