చైనాలోని తమ కంపెనీలకు జపాన్ ఆఫర్.. భారత్‌కు తరలిస్తే భారీ రాయితీలు ఇస్తామని ప్రకటన

  • ప్రోత్సాహకాల కోసం 23,550 యెన్‌ల కేటాయింపు
  • ఆసియాన్ ప్రాంతంలో కంపెనీల విస్తరణను ప్రోత్సహించే లక్ష్యం
  • భారత్‌లో పెరగనున్న పెట్టుబడులు
చైనాను విడిచిపెట్టి భారత్, లేదంటే బంగ్లాదేశ్ తరలి వెళ్లే తమ దేశ కంపెనీలకు భారీ రాయితీలు ఇవ్వనున్నట్టు జపాన్ ప్రకటించింది. ఆసియాన్ ప్రాంతంలో కంపెనీల విస్తరణను ప్రోత్సహించే లక్ష్యంతో 2020-21 ఆర్థిక సంవత్సరం బడ్జెట్‌లో ఏకంగా 23,500 కోట్ల యెన్‌లు (22.1 కోట్ల డాలర్లు) కేటాయించింది. చైనాలోని సంస్థలు తమ ఉత్పత్తి కేంద్రాలను భారతదేశానికి కానీ, లేదంటే బంగ్లాదేశ్‌కు కానీ తరలిస్తే భారీ రాయితీలు ఇవ్వాలని జపాన్ నిర్ణయించినట్టు నిక్కీ ఏసియాన్ రివ్యూ నివేదిక పేర్కొంది.

ఔషధ, ఎలక్ట్రానిక్ ఉత్పత్తుల్ని ఆసియా దేశాలన్నింటికీ విస్తరించాలన్నది జపాన్ ప్రభుత్వ లక్ష్యమని ఆ నివేదిక వివరించింది. వాస్తవానికి జపాన్‌కి చెందిన ఉత్పత్తి ప్లాంట్లు అత్యధికం చైనాలో ఉన్నాయి. అయితే, కరోనా వైరస్ కారణంగా వాటి ఉత్పత్తి నిలిచిపోయింది. మరోవైపు, కరోనా వైరస్ వ్యాప్తికి చైనానే కారణమని ప్రపంచ దేశాలు నిందిస్తున్నాయి. ఈ నేపథ్యంలో చైనా నుంచి కంపెనీలను తరలిస్తే భారీ రాయితీలు ఇస్తామని ప్రకటించడం చైనాకు షాకేనని నిపుణులు చెబుతున్నారు. కాగా, భారత్‌కు తరలిస్తే ప్రోత్సాహకాలు ఇస్తామన్న జపాన్ ప్రకటనతో భారత్‌లో పెట్టుబడులు పెరిగే అవకాశం ఉందని చెబుతున్నారు.


More Telugu News