రష్యా కరోనా వ్యాక్సిన్ సురక్షితం: లాన్సెట్ అధ్యయనం

  • స్పుత్నిక్ వి పేరుతో వ్యాక్సిన్ రూపొందించిన రష్యా
  • యావత్ ప్రపంచాన్ని ఆశ్చర్యపరిచిన అగ్ర దేశం 
  • రష్యా వ్యాక్సిన్ పై సందేహాలు వ్యక్తం చేస్తున్న దేశాలు
కరోనా వైరస్ ను తుదముట్టించే సమర్థవంతమైన వ్యాక్సిన్ కోసం యావత్ ప్రపంచం ఆశగా ఎదురుచూస్తున్న వేళ రష్యా సంచలన ప్రకటన చేయడం తెలిసిందే. తాము రూపొందించిన స్పుత్నిక్ వి వ్యాక్సిన్ విజయవంతమైందని రష్యా వెల్లడించడంతో మిగతా దేశాలు విస్మయం చెందాయి. అంత హడావుడిగా రూపొందించిన ఆ వ్యాక్సిన్ సురక్షితమైనదేనా అంటూ సందేహాలు ఇప్పటికీ వినిపిస్తున్నాయి. ఈ నేపథ్యంలో, ప్రముఖ అంతర్జాతీయ మెడికల్ జర్నల్ ది లాన్సెట్ ఆసక్తికర అధ్యయనం వెలువరించింది.

మానవులపై నిర్వహించిన స్పుత్నిక్ వి వ్యాక్సిన్ క్లినికల్ ట్రయల్స్ లో ఎటువంటి దుష్ఫలితాలు చోటుచేసుకోలేదని, యాంటీబాడీల పరంగా సానుకూల ఫలితాలు వచ్చాయని ది లాన్సెట్ పేర్కొంది. ప్రాథమిక దశల్లో ఈ వ్యాక్సిన్ తీసుకున్న ప్రతి ఒక్కరిలో యాంటీబాడీల స్పందన కనిపించిందని వెల్లడించింది. జూన్-జూలైలో 76 మంది వలంటీర్లపై రెండు దశల్లో ప్రయోగాలు జరుపగా, 100 శాతం యాంటీబాడీల అభివృద్ధిని గుర్తించారని వివరించింది.

వలంటీర్లలో 38 మంది పెద్దవాళ్లు కూడా ఉన్నారని, వ్యాక్సిన్ ప్రధాన కర్తవ్యం అయిన యాంటీబాడీల తయారీని స్పుత్నిక్ వి విజయవంతంగా నిర్వర్తించిందని తెలిపింది. అయితే, దీర్ఘకాలిక ప్రయోజనాలు, భద్రత దృష్ట్యా ఈ వ్యాక్సిన్ పై మరిన్ని పరీక్షలు, మరింత పర్యవేక్షణ అవసరం అని ది లాన్సెట్ స్పష్టం చేసింది.


More Telugu News