కరోనాకు ఇప్పట్లో వ్యాక్సిన్‌ రాదు: ప్రముఖ అంటువ్యాధుల నిపుణుడు ఆంటోని ఫౌచి

  • నవంబర్‌ 1లోపు అందుబాటులోకి వస్తుందన్న అమెరికా ప్రభుత్వం
  • తాను అలా అనుకోవడం లేదన్న ఫౌచీ
  • వచ్చే ఏడాది ఆరంభంలో కరోనా వ్యాక్సిన్‌ వచ్చే ఛాన్స్ 
ప్రపంచాన్ని ముప్పుతిప్పలు పెడుతోన్న కరోనా వైరస్‌ను అంతమొందించేందుకు వ్యాక్సిన్‌ ని అభివృద్ధి చేసేందుకు ప్రపంచ దేశాలు ప్రయత్నాలు జరుపుతున్న విషయం తెలిసిందే. అమెరికాలోనూ ఈ వ్యాక్సిన్‌ కోసం పరిశోధకులు ప్రయత్నిస్తూ విజయం దిశగా దూసుకెళ్తున్నారు. ఈ నేపథ్యంలో ఈ వ్యాక్సిన్‌ అమెరికాలో నవంబర్‌ 1లోపు అందుబాటులోకి రానుందని అమెరికా‌ ప్రభుత్వం ప్రకటించింది.

వ్యాక్సిన్‌ను ప్రజలందరికీ అందేలా ఏర్పాట్లు పూర్తి చేసుకోవాలని అన్ని రాష్ట్రాల గవర్నర్లను ఇప్పటికే ప్రభుత్వం ఆదేశించింది. అయితే, అంత త్వరగా వ్యాక్సిన్‌ వచ్చే అవకాశం లేదని అమెరికాలోని ప్రముఖ అంటువ్యాధుల నిపుణుడు ఆంటోని ఫౌచి అన్నారు. అక్టోబర్‌ నాటికి వ్యాక్సిన్‌ అందుబాటులోకి వస్తుందని, తాను అనుకోవటం లేదని చెప్పారు. అయితే, వ్యాక్సిన్‌ రావడం అసాధ్యమేమీ కాదని ఆయన చెప్పారు.

వచ్చే ఏడాది ఆరంభంలో కరోనా వ్యాక్సిన్‌ వచ్చే అవకాశముందని ఫౌచీ చెప్పారు. వ్యాక్సిన్‌ అందుబాటులోకి వచ్చిన తర్వాత ఏడాది లోపు ప్రపంచం తిరిగి సాధారణ పరిస్థితికి చేరుకోగలదని తెలిపారు. కరోనా కట్టడిలో నిపుణుల మార్గదర్శకాలను పాటించకపోతే, కరోనా ప్రభావాన్ని మరి కొన్నాళ్ల పాటు ఎదుర్కోవాల్సి ఉంటుందని హెచ్చరించారు.


More Telugu News