మన సినీరంగంలోనూ ఇంతకంటే దారుణమైన పరిస్థితులు ఉండేవి: సుశాంత్ మృతిపై విజయశాంతి స్పందన

  • దోషుల్ని పట్టుకునేందుకు చేస్తున్న ప్రయత్నాలు భేష్
  • మన దగ్గర మాత్రం మమ అనిపించేస్తున్నారు
  • సుశాంత్ కేసులో బయటకు వస్తున్న విషయాలు దిగ్భ్రాంతికి గురిచేస్తున్నాయి
బాలీవుడ్ యువనటుడు సుశాంత్ సింగ్ రాజ్‌పుత్ మృతి ఘటనపై ప్రముఖ నటి, కాంగ్రెస్ సీనియర్ నేత విజయశాంతి స్పందించారు. సుశాంత్ కేసులో దోషుల్ని పట్టుకునేందుకు, వాస్తవాల్ని వెలికి తీసేందుకు ప్రభుత్వాలు గట్టి ప్రయత్నాలే చేస్తున్నాయని ప్రశంసించారు. ఒకప్పుడు మన సినీ రంగంలోనూ ఇంతకంటే దారుణమైన పరిస్థితులు ఉండేవని, ఎందరో మహిళా నటులు ఆత్మహత్యలు చేసుకున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ఆయా కేసుల్లో ఈ స్థాయిలో దర్యాప్తులు జరిగి ఉంటే వారి ఆత్మకు శాంతి కలిగి ఉండేదని అన్నారు. నామమాత్రపు కేసులు, తూతూమంత్రపు విచారణలతో చివరికి మమ అనిపించేశారని ఆగ్రహం వ్యక్తం చేశారు.

సుశాంత్ కేసులు ప్రతి రోజు వెలుగుచూస్తున్న విషయాలు విస్మయానికి గురిచేస్తున్నాయన్నారు. దర్యాప్తులు, విచారణలు వివక్షకు తావులేకుండా ఉండాలన్నారు. సెలబ్రిటీలకైనా, సామాన్యులకైనా న్యాయప్రక్రియ ఒకేలా ఉండాలన్న ప్రముఖ న్యాయవాది హరీశ్ సాల్వే వ్యాఖ్యలను ఈ సందర్భంగా విజయశాంతి ఉదహరించారు. దర్యాప్తు సంస్థల వల్ల ఆశించిన స్థాయిలో ఫలితం రాని సమయాల్లో ప్రభుత్వాలు అప్పీలుకు వెళ్లకపోవడం వల్ల ఎన్నో కేసులు నీరు గారిపోతున్నాయని విజయశాంతి ఆవేదన వ్యక్తం చేశారు.


More Telugu News