కలెక్టర్, ఆర్డీవో చెబితేనే అంజిరెడ్డిని కలిశా.. ఏసీబీ విచారణలో కీసర తహసీల్దార్

  • నిందితుల వాంగ్మూలాలను కోర్టుకు సమర్పించిన ఏసీబీ అధికారులు
  • హన్మకొండ తహసీల్దార్ పేరు కూడా తెరపైకి
  • రూ. 1.10 కోట్లు ఎక్కడి నుంచి తెచ్చిందీ వెల్లడించిన నిందితుడు శ్రీనాథ్
సంచలనం సృష్టించిన కోటి రూపాయల లంచం కేసులో ఏసీబీకి చిక్కిన కీసర తహసీల్దార్ నాగరాజు విచారణలో మరిన్ని కీలక విషయాలను వెల్లడించాడు. తనంతట తాను శ్రీనాథ్, అంజిరెడ్డిలను కలవలేదని, మేడ్చల్ జిల్లా కలెక్టర్, ఆర్డీవో ఆదేశాల మేరకే తాను వారిని కలిసినట్టు చెప్పడం మరో సంచలనానికి కారణమైంది.

భూ వివాదంలో రూ. 1.10 కోట్లతో పట్టుబడిన నాగరాజు సహా నిందితుల్ని కోర్టు అనుమతితో మూడు రోజుల కస్టడీకి తీసుకుని విచారించిన సమయంలో అనేక ఆసక్తికర విషయాలు బయటకొచ్చాయి. ఈ మొత్తం కేసులో మేడ్చల్ కలెక్టర్‌తోపాటు, ఆర్డీవో రవి, హన్మకొండ తహసీల్దార్ కిరణ్ పేర్లు ఇప్పుడు బయటకు వచ్చాయి. వాంగ్మూలాలు రికార్డు చేసిన దర్యాప్తు అధికారులు ఏసీబీ కోర్టుకు సమర్పించారు.  

విచారణలో ఏసీబీ అధికారులు అడిగిన పలు ప్రశ్నలకు నాగరాజు నుంచి మౌనమే సమాధానమైంది. అయితే, కలెక్టర్, ఆర్డీవో ఆదేశాల మేరకే అంజిరెడ్డి, శ్రీనాథ్‌లను కలిసేందుకు కాప్రా వెళ్లానని స్పష్టం చేశారు. నిజానికి వారికి ఈ వివాదాస్పద భూమితో ఎటువంటి సంబంధం లేదని పేర్కొన్నారు. ఈ కేసులో ఏ3 నిందితుడైన రియల్టర్ శ్రీనాథ్ కూడా పలు కీలక విషయాలను బయటపెట్టాడు. వివాదాస్పద భూమి గురించి కీసర మండలం భోగారానికి చెందిన ఇక్బాల్ ద్వారానే తెలిసిందని చెప్పాడు. భూ వివాదంపై తాను సూచించిన పరిష్కారానికి భూమి పొజిషనల్‌లో ఉన్న పట్టాదారులు, ముస్లింలు అంగీకరించినట్టు తెలిపారు. అందులో భాగంగానే  మొయినుద్దీన్‌ గాలిబ్‌ మరో 37 మంది ద్వారా తన పేరిట జీపీఏ చేయించినట్లు వివరించాడు.

ఆగస్టు 14న తన స్నేహితుడు యుగంధర్‌తో కలిసి కారులో కాజీపేట వెళ్లి తన స్నేహితుడైన ముడిదె తేజేశ్వర్ సహకారంతో రూ. 1.10 కోట్లు తెచ్చినట్టు వివరించారు. రూ. 70 లక్షలను వరంగల్ బస్టాండ్ సమీపంలో ఉన్న చాంబర్ ఆఫ్ కామర్స్ నుంచి, దేవీ థియేటర్ వెనకభాగంలో రూ. 30 లక్షలు, అంబేద్కర్ భవన్ వద్ద రత్నం రాజిరెడ్డి, ఆర్ఎల్ రవి నుంచి మరో రూ. 10 లక్షలు తీసుకున్నట్టు వివరించాడు. తహసీల్దార్ నాగరాజుతో పరిచయం ఎలా జరిగిందో వివరించిన శ్రీనాథ్.. ఆర్డీవోకు లంచం ఇచ్చావా? అన్న ప్రశ్నకు మాత్రం సమాధానం చెప్పలేదు. దీంతో మరిన్ని విషయాలకు కూడా అతడు నోరు మెదపలేదని అధికారులు తెలిపారు.


More Telugu News