రష్యాలో రాజ్‌నాథ్‌కు సెల్యూట్‌తో స్వాగతం.. ‘నమస్తే’తో ప్రతిస్పందించిన రక్షణ మంత్రి

  • ఎస్‌సీవో సమావేశంలో పాల్గొనేందుకు మాస్కో చేరుకున్న రాజ్‌నాథ్
  • సెల్యూట్‌తో స్వాగతం పలికిన అధికారికి నమస్కారం
  • రాజ్‌నాథ్ వీడియోకు విపరీతమైన వ్యూస్
షాంఘై కోఆపరేషన్ ఆర్గనైజేషన్ (ఎస్‌సీవో) సమావేశానికి భారత్ తరపున హాజరైన రక్షణ శాఖ మంత్రి రాజ్‌నాథ్ సింగ్‌ భారతీయ సంస్కృతిని  సంప్రదాయాలను అడుగడుగునా ప్రదర్శించారు. మాస్కో విమానాశ్రయం వద్ద రాజ్‌నాథ్‌కు ఘన స్వాగతం లభించింది. రష్యన్ మేజర్ జనరల్ బుక్తీవ్ యూరీ నికోలేవిచ్ సెల్యూట్‌తో స్వాగతం పలికారు. బదులుగా రాజ్‌నాథ్ నమస్కారం పెట్టారు. అలాగే, రష్యన్ బృందంలో ఓ సభ్యుడు షేక్ హ్యాండ్ ఇచ్చేందుకు ప్రయత్నించగా మంత్రి నమస్కరించారు.

ఇందుకు సంబంధించిన వీడియోను మంత్రి తన ట్విట్టర్ ఖాతాలో పోస్టు చేశారు. కాగా, కరోనా వైరస్ వ్యాప్తి నేపథ్యంలో అది మరింత విస్తరించకుండా ఉండేందుకు ప్రపంచంలోని పలు దేశాలు షేక్‌హ్యాండ్‌‌కు బదులుగా భారతీయ ప్రాచీన విధానమైన  నమస్కారాన్ని ఆచరిస్తున్నాయి. తాను మాస్కో చేరుకున్నానని, రష్యన్ ప్రతినిధి జనరల్ సెర్గేయ్ షోయ్‌గూతో రేపు జరగనున్న ద్వైపాక్షిక సమావేశం కోసం ఎదురుచూస్తున్నానని ట్వీట్ చేశారు. రాజ్‌నాథ్ ట్వీట్‌కు విపరీతమైన వ్యూస్ వచ్చాయి.


More Telugu News