సీఎం జగన్ నిర్ణయంతో ప్రభుత్వంపై భారం తగ్గుతుంది: పేర్ని నాని

  • ఉచిత విద్యుత్ పథకంలో రైతులకు నగదు బదిలీ
  • రాష్ట్ర కేబినెట్ ఆమోదం
  • కొత్తగా 10 వేల మెగావాట్ల సోలార్ విద్యుత్ ప్రాజెక్టు
ఏపీలో ఉచిత విద్యుత్ పథకం కింద రైతులకు నేరుగా నగదు బదిలీ చేసే విధానానికి మంత్రిమండలి ఆమోదం తెలిపిన అనంతరం మంత్రి పేర్ని నాని మీడియాతో మాట్లాడారు.  రైతులకు పగటిపూట ఉచిత విద్యుత్ ఇచ్చే క్రమంలో ప్రభుత్వంపై ఇప్పటివరకు రూ.8,300 కోట్ల పైచిలుకు భారం పడిందని వివరించారు. రాబోయే రోజుల్లో ఇది పెరిగే అవకాశం ఉందని, కొత్త రైతులు వస్తుంటారని, కొత్త కనెక్షన్లు ఇవ్వాల్సి వస్తుందని తెలిపారు. అందుకే ఈ భారం తగ్గించుకునేందుకు సీఎం జగన్ ప్రభుత్వం 10 వేల మెగావాట్ల సోలార్ విద్యుత్ పార్కు ఏర్పాటు చేస్తోందని వెల్లడించారు.

ట్రాన్స్ మిషన్ నష్టాలు కానీ, డిస్కంల నష్టాలు కానీ, అన్నింటిని కలుపుకుంటే ఒక యూనిట్ కు రూ.6.70 పడుతోందని, ఈ భారం తగ్గించుకునేందుకు ప్రభుత్వమే 10 వేల మెగావాట్ల సోలార్ విద్యుత్ ప్రాజెక్టు ఏర్పాటు చేస్తోందని, తద్వారా ఒక యూనిట్ కు రూ.2.50 లోపే పడుతుందని చెప్పారు. భవిష్యత్ లో ఏ ప్రభుత్వం వచ్చినా, ఈ విధానంతో రైతులకు ఉచిత విద్యుత్ కొనసాగేలా సీఎం జగన్ సోలార్ ప్రాజెక్టు నిర్ణయం తీసుకున్నారని పేర్ని నాని స్పష్టం చేశారు.


More Telugu News