తెలుగులో వస్తున్న జేమ్స్ బాండ్ సినిమా.. 'నో టైమ్ టు డై'!

  • బోర్ కొట్టని జేమ్స్ బాండ్ సినిమాలు  
  • డేనియల్ క్రేగ్ హీరోగా 'నో టైమ్ టు డై'
  • పలు భారతీయ భాషల్లోకి అనువాదం  
  • నవంబర్ లో ఒకేసారి విడుదల
ఆంగ్ల చిత్రాలలో జేమ్స్ బాండ్ చిత్రాలకు వుండే ప్రత్యేకత, ప్రాధాన్యత వేరు. దశాబ్దాలుగా ఈ సీరీస్ లో పలు చిత్రాలు వస్తున్నా ప్రేక్షకులకు ఎవ్వరికీ బోర్ అన్నదే కొట్టదు. అందుకే, బాండ్ పాత్రలకు ప్రత్యేకంగా అభిమాన ప్రేక్షకులు కూడా వున్నారు. ఆ సినిమాల కోసం ఉత్సుకతతో ఎదురుచూస్తూ వుంటారు. ఈ క్రమంలో తాజాగా బాండ్ సీరీస్ లో వస్తున్న 25వ చిత్రమే 'నో టైమ్ టు డై'.

బాండ్ పాత్రలో డేనియల్ క్రేగ్ నటించిన ఈ చిత్రానికి క్యారీ జోజీ దర్శకత్వం వహించాడు. గత కొన్నాళ్లుగా మానవాళిని అతలాకుతలం చేస్తున్న మహమ్మారి కరోనా లాంటి ఒక వైరస్ ప్రపంచం మీద దాడి చేయడం.. ప్రజలు హాహాకారాలు చేస్తూ భీతిల్లడం.. ఆ మహమ్మారి కోరల నుంచి ప్రజలను రక్షించడం కోసం బాండ్ రంగంలోకి దిగడం..వంటి ఆసక్తికర కథాంశంతో దీనిని తెరకెక్కించారు.

ఇప్పుడీ చిత్రాన్ని తెలుగు సహా ఇతర భారతీయ భాషల్లోకి కూడా అనువదించారు. తెలుగులో వేరే పేరుతో కాకుండా అదే టైటిల్ తో రిలీజ్ చేయనున్నారు. వాస్తవానికి ఏప్రిల్ నెలలోనే విడుదల కావలసిన ఈ చిత్రం కరోనా నేపథ్యంలో వాయిదాపడింది. ఇక దీనిని అన్ని భాషల్లోనూ ఒకేసారి నవంబర్లో రిలీజ్ చేయడానికి ప్లాన్ చేస్తున్నారు.


More Telugu News