మిర్యాలగూడ అత్యాచార బాధిత యువతి కేసులో కీలక మలుపు.. అండగా ఉన్న వ్యక్తే ప్రధాన నిందితుడు

  • ప్రధాన నిందితుడిగా స్వచ్ఛంద సంస్థ నిర్వాహకుడు డాలర్ భాయ్
  • బాధితురాలి నుంచి మరో మారు వాంగ్మూలాన్ని నమోదు చేయనున్న పోలీసులు
  • పొంతని లేని బాధితురాలి మాటలు
 139 మంది అత్యాచారం చేశారంటూ మిర్యాలగూడ యువతి పెట్టిన కేసులో మరో కీలక మలుపు చోటుచేసుకుంది. ఈ కేసులో పలువురు ప్రముఖులు, సెలబ్రిటీలు ఉన్నట్టు ఇటీవల వార్తలు వినిపించాయి. తాజాగా, ఈ కేసులో మరో షాకింగ్ విషయం బయటపడింది.

బాధితురాలికి ఇప్పటి వరకు అండగా ఉండి, ఆమెతో ఫిర్యాదు చేయించిన స్వచ్ఛంద సంస్థ నిర్వాహకుడే ఈ కేసులో ప్రధాన నిందితుడని తెలుస్తోంది. దీంతో బాధితురాలి నుంచి మరోమారు వాంగ్మూలం తీసుకోవాలని సీసీఎస్ పోలీసులు నిర్ణయించారు. రాష్ట్రవ్యాప్తంగా సంచలనం సృష్టించిన ఈ కేసును సీసీఎస్ మహిళా పోలీస్ స్టేషన్ ఏసీపీ శ్రీదేవి దర్యాప్తు చేస్తున్నారు.

కాగా, సోమాజీగూడలో స్వచ్ఛంద సంస్థ నిర్వహిస్తూ తనకు సాయం చేస్తున్నట్టు నటించిన రాజశేఖర్‌రెడ్డి, అలియాస్ డాలర్ ‌భాయ్ కారణంగానే తాను ఫిర్యాదు చేసినట్టు ఇటీవల పేర్కొన్న బాధితురాలు, అతడు చెప్పిన పేర్లనే ఫిర్యాదులో పేర్కొన్నట్టు చెప్పింది. దీంతో పోలీసులు డాలర్ భాయ్‌ను ప్రధాన నిందితుడిగా అనుమానిస్తున్నారు.

అయితే, ఫిర్యాదు సమయంలో ఆమె చెప్పిన దానికి, విలేకరుల సమావేశంలో చెప్పిన దానికి పొంతన లేకపోవడంతో బాధితురాలి నుంచి మరోమారు వాంగ్మూలం తీసుకోవాలని పోలీసులు నిర్ణయించారు. నిందితుల జాబితాలోనూ మార్పులు చేయనున్నట్టు తెలుస్తోంది. అలాగే, భవిష్యత్తుల్లో ఎదురయ్యే ఇబ్బందుల నుంచి తప్పించుకోవడానికి న్యాయస్థానంలోనూ 164 స్టేట్‌మెంట్‌ను రికార్డు చేసేందుకు రెడీ అవుతున్నారు.


More Telugu News