కరోనా కష్టకాలంలో నా పుట్టినరోజు వచ్చింది... మనసు సన్నద్ధంగా లేదు: పవన్ కల్యాణ్

  • ఇవాళ పవన్ పుట్టినరోజు
  • శుభాకాంక్షలు వెల్లువెత్తిన వైనం
  • పేరుపేరునా కృతజ్ఞతలు తెలిపిన జనసేనాని
జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ నేడు పుట్టినరోజు జరుపుకుంటున్నారు. పుట్టినరోజు వేడుకలకు తాను చాలా దూరం అని పవన్ ఎప్పటినుంచో చెబుతున్నా, ఆయనపై శుభాకాంక్షలు వెల్లువెత్తుతున్నాయి. పవన్ జన్మదినం సందర్భంగా ఆయన కొత్త సినిమా అప్ డేట్స్ కూడా ప్రకటించారు. ఈ నేపథ్యంలో పవన్ స్పందించారు. తనకు జన్మదిన శుభాకాంక్షలు తెలిపిన ప్రతి ఒక్కరికీ పేరుపేరునా కృతజ్ఞతలు తెలిపారు.

దేశ ప్రజలు కరోనా మహమ్మారి భయంతో చిగురుటాకుల్లా వణికిపోతున్నారని, చేతి వృత్తుల వారి నుంచి కూలీలు, కార్మికులు, కర్షకులు, చిరు వ్యాపారులు, చిరుద్యోగులు ఆర్థికంగా అణగారిపోతున్నారని వెల్లడించారు. కొవిడ్ పై ముందుండి పోరాడుతున్న డాక్టర్లు, ఇతర వైద్య సిబ్బంది, వివిధ రంగాల ఉద్యోగులు ప్రాణాలు కోల్పోతున్నారని, భగవంతుడ్ని ప్రార్థించడం తప్ప ఏమీ చేయలేని నిస్సహాయ పరిస్థితుల్లో చాతుర్మాస్య దీక్ష చేపట్టానని వివరించారు.

ప్రతి ఏటా ఈ దీక్ష చేస్తున్నా, ఈసారి కరోనా నుంచి ప్రజలను కాపాడమని కోరుకుంటూ దీక్ష ఆచరిస్తున్నానని, ఈ సమయంలో తన పుట్టినరోజు వచ్చిందని పవన్ వెల్లడించారు. తాజా పరిస్థితుల నేపథ్యంలో శుభాకాంక్షలు స్వీకరించడానికి మనసు సన్నద్ధంగా లేదని తెలిపారు. అయినాగానీ, బంధువులు, సన్నిహితులు, సినీ తారలు, టెక్నీషియన్లు, అభిమానులు, జనసైనికులు ఎంతో వాత్సల్యంతో, అభిమానంతో శుభాకాంక్షలు తెలిపారని, వారందరికీ పేరుపేరునా కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాని పవన్ పేర్కొన్నారు.

ఈ ప్రేమాభిమానాలు మరింత బాధ్యతను పెంపొందించాయని, కరోనా సమస్యలు తొలగిపోయి సాధారణ పరిస్థితులు ఏర్పడిన వెంటనే ఎప్పటిలాగే మీ అందరి ముందుకు వస్తానని తెలిపారు.


More Telugu News