7వ తేదీ నుంచి దేశవ్యాప్తంగా మెట్రో రైలు సేవలు.. ప్రయాణికులు ఇవి తెలుసుకోవాలి!

  • కంటైన్మెంట్ జోన్లలో స్టేషన్లు తెరుచుకోవు
  • సామాజికదూరం కోసం కొన్ని స్టేషన్లలో రైళ్లు ఆగవు
  • ప్రతి ఒక్కరూ మాస్క్ ధరించాల్సిందే
కరోనా నేపథ్యంలో ఆగిపోయిన మెట్రో రైలు సేవలు ఈ నెల 7వ తేదీ నుంచి దేశ వ్యాప్తంగా పునఃప్రారంభం కానున్నాయి. ఈ నెల 12 నుంచి అన్ని కారిడార్లు ప్రయాణికులకు అందుబాటులోకి రానున్నాయి. ఈ నేపథ్యంలో, మెట్రో రైలు సేవలకు సంబంధించి కేంద్ర ప్రభుత్వం కొన్ని మార్గదర్శకాలను విడుదల చేసింది. అవేంటో తెలుసుకుందాం.

  • కంటైన్మెంట్ జోన్లలో ఉండే స్టేషన్లలో ఎంట్రీ, ఎగ్జిట్ గేట్లను మూసే ఉంచుతారు.
  • థర్మల్ స్క్రీనింగ్ తర్వాత కరోనా లక్షణాలు లేని ప్రయాణికులను మాత్రమే స్టేషన్ లోపలకు అనుమతిస్తారు.
  • సామాజికదూరాన్ని పాటించే నేపథ్యంలో, ప్రయాణికుల రద్దీని తగ్గించేందుకు రైళ్లు కొన్ని స్టేషన్లలో ఆగకుండానే వెళ్లిపోతాయి.
  • అతి తక్కువ లగేజీని మాత్రమే అనుమతిస్తారు. మెటల్ ఐటెమ్స్ ని అనుమతించరు.
  • సామాజికదూరాన్ని పాటించే క్రమంలో స్టేషన్లతో పాటు, రైలు బోగీల్లో కూడా మార్కింగ్ వేస్తారు.
  • ప్రయాణికులతో పాటు సిబ్బంది కూడా మాస్కులు కచ్చితంగా ధరించాలి. మాస్కులు లేకుండా వచ్చే ప్రయాణికులు వాటిని స్టేషన్లలో కొనుక్కునేందుకు మెట్రో రైల్ కార్పొరేషన్ ఏర్పాట్లు చేయాలి.
  • ఆరోగ్యసేతు యాప్ ను వినియోగిస్తే మంచిది.
  • స్టేషన్ ఎంట్రన్స్ లో శానిటైజర్లు అందుబాటులో ఉంటాయి.
  • తరచుగా స్టేషన్ మొత్తాన్ని శానిటైజ్ చేయాలి.
  • స్మార్ట్ కార్డ్, ఆన్ లైన్ చెల్లింపులకు ప్రాధాన్యతను ఇవ్వాలి.
  • టోకెన్లు, టికెట్లను కూడా సరైన రీతిలో శానిటైజ్ చేయాలి.


More Telugu News