మోసం చేయడం అనేది సీఎం జగన్ రక్తంలోనే లేదు: అజేయ కల్లం

  • రైతులకు నగదు బదిలీపై వివరణ ఇచ్చిన అజేయ కల్లం
  • కేంద్రం సంస్కరణలకు అనుగుణంగా చర్యలు తీసుకుంటున్నట్టు వెల్లడి
  • ఉచిత విద్యుత్ కొనసాగుతుందని స్పష్టీకరణ
  • జగన్ కుటుంబం మాట తప్పదన్న ప్రభుత్వ ముఖ్య సలహాదారు
ఉచిత విద్యుత్ కనెక్షన్లకు మీటర్ల బిగింపు అంశంపై ఏపీ ప్రభుత్వ ముఖ్య సలహాదారు అజేయ కల్లం వివరణ ఇచ్చారు. కేంద్ర సంస్కరణలకు అనుగుణంగా చర్యలు తీసుకుంటున్నామని స్పష్టం చేశారు. రైతులకు ఇచ్చే సబ్సిడీలను నేరుగా వారి ఖాతాల్లోకి బదిలీ చేయాలని కేంద్రం ముసాయిదాలో స్పష్టం చేసిందని, అందుకే తాము విద్యుత్ అంశంలో రైతులకు నగదు బదిలీ తీసుకువస్తున్నామని వివరణ ఇచ్చారు. కేంద్రం ముసాయిదాలోని కొన్ని అంశాలను ఏపీ, తెలంగాణతో సహా పలు రాష్ట్రాలు అభ్యంతరపెట్టినా, ఆ ముసాయిదాను బిల్లు రూపంలో తీసుకువచ్చి, దేశం మొత్తం అమలు చేసేందుకు కేంద్రం సిద్ధపడుతుండడంతో, తాము ఆ ముసాయిదాలోని అంశాలను పాటించక తప్పడంలేదని అజేయ కల్లం వివరించారు.

అయితే ఉచిత్ విద్యుత్ సాధకబాధకాలపై తాము సీఎం జగన్ ముందు ఏకరవు పెట్టినా, ఆయన మాత్రం ఎక్కడా వెనుకంజ వేయలేదని, ఇది తన తండ్రి తీసుకువచ్చిన పథకం అని, ఎట్టిపరిస్థితుల్లోనూ కొనసాగించి తీరాల్సిందేనని కృతనిశ్చయం వెలిబుచ్చారని వెల్లడించారు. రైతే మనకు తొలి ప్రాధాన్యత అని, రైతు కోసం ఏమైనా చేయాలని, దీన్ని తప్పకుండా మనం కొనసాగించి తీరాలని చెప్పారని, దాంతో సీఎం ఆలోచనలకు అనుగుణంగా నూతన విధానం రూపొందించామని చెప్పారు.

ఈ క్రమంలో రైతులకు కొత్త అకౌంట్లు ఓపెన్ చేయించాలని నిర్దేశించారని, పాత అకౌంట్లతో అనేక అంశాలు ముడిపడి ఉండే అవకాశం ఉన్నందున తాజా అకౌంట్లతో ఈ పథకం షురూ చేయాలని సీఎం సూచించినట్టు అజేయ కల్లం పేర్కొన్నారు. డిస్కంలు అమర్చే స్మార్ట్ మీటర్ల రీడింగ్ ను ఫైనాన్స్ విభాగానికి పంపిస్తారని, ఆ సబ్సిడీ మొత్తానికి రైతు ఖాతాలో నగదు జమ చేయడం జరుగుతుందని వివరించారు. ఆ అకౌంట్ నుంచి ఆటోమేటిగ్గా డిస్కంకు నగదు బదిలీ అవుతుందని తెలిపారు.

దీని ద్వారా ప్రతి రైతు తనకు ఎంత సబ్సిడీ వస్తుందో తెలుసుకోగలుగుతాడని పేర్కొన్నారు. ఈ ప్రక్రియలో రైతుకు ఎలాంటి ఇబ్బంది ఉండదని స్పష్టం చేశారు. పైగా స్మార్ట్ మీటర్లు కూడా ఉచితంగా బిగిస్తారని అజేయ కల్లం చెప్పారు. ఇందులో ఎలాంటి మోసం లేదని అన్నారు. మోసం చేయడం అనేది సీఎం జగన్, ఆయన తండ్రి వైఎస్ రక్తంలోనే లేదని అన్నారు. వారు మాట మీద నిలబడే వ్యక్తులని, సీఎం జగన్ ది రైతుల కోసం నిలబడే ప్రభుత్వం అని తెలిపారు.


More Telugu News