తన అర్ధాంగి మెలానియాను ఓ రేంజిలో ఆకాశానికెత్తేసిన ట్రంప్

  • ఇటీవల ఆర్ఎన్ సీ లో ప్రసంగించిన మెలానియా
  • ఆమెను అందరూ ఇష్టపడ్డారన్న ట్రంప్
  • ఇంగ్లీషు మాతృభాష కాకపోయినా అదరగొట్టిందని వివరణ
ఇటీవల జరిగిన రిపబ్లికన్ నేషనల్ కన్వెన్షన్ (ఆర్ఎన్ సీ) కార్యక్రమంలో  మెలానియా ప్రసంగం అద్భుతమంటూ అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తన అర్ధాంగిని పొగడ్తల జల్లులో ముంచెత్తారు. వాస్తవానికి మెలానియా స్లొవేనియా సంతతి మహిళ. ఆమె ఇంగ్లీషు ఉచ్చారణ అమెరికన్లతో పోల్చితే చాలా భిన్నంగా ఉంటుంది. ఈ అంశంలో అమెరికా మీడియా అనేక వ్యాఖ్యానాలు కూడా చేసింది. దాంతో ఈ అంశంలో తన భార్యను ట్రంప్ వెనకేసుకొచ్చారు.

ఆర్ఎన్ సీ లో మెలానియా తన స్పీచ్ తో అందరినీ ఆకట్టుకున్నారని కొనియాడారు. మహిళా ఓటర్లను మెలానియా విశేషంగా ఆకర్షించారని తెలిపారు. "ఓటర్లు ఆమెను బాగా ఇష్టపడ్డారు. ఆమె స్టయిల్ ను, ఆమె ఔన్నత్యాన్ని, ఆమె గుణశీలతను వారు ప్రేమించారు. మొత్తమ్మీద ఆమె ప్రసంగం మహాద్భుతం అని చెప్పాలి. ఎందుకంటే ఇంగ్లీషు ఆమె మాతృభాష కాదన్న విషయాన్ని మీరు అర్థం చేసుకోవాలి. ఎంతమంది వేదికలెక్కి ప్రపంచాన్ని ఉద్దేశించి మాట్లాడగలరు? ఆలోచించినా, ఆలోచించకపోయినా... మెలానియా అమోఘమైన రీతిలో ప్రసంగించింది" అంటూ ఆకాశానికెత్తేశారు.


More Telugu News