తుది మెట్టుపై కరోనా వ్యాక్సిన్... స్వయంగా ప్రకటించిన డొనాల్డ్ ట్రంప్!

  • అతి త్వరలోనే ప్రజా వినియోగానికి
  • అసాధ్యం అనుకున్న ఎన్నో పనులను చేశాం
  • కరోనా వ్యాక్సిన్ విషయంలోనూ చూపిస్తామన్న ట్రంప్
కరోనా వ్యాక్సిన్ ను కట్టడి చేసే దిశగా ఆక్స్ ఫర్డ్ తో కలిసి ఆస్ట్రాజెనికా సంయుక్తంగా అభివృద్ధి చేస్తున్న వ్యాక్సిన్, ప్రజా వినియోగానికి తుది అనుమతులను పొందే తరుణం అతి త్వరలో రానుందని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ వ్యాఖ్యానించారు. తాజాగా మీడియాతో మాట్లాడిన ఆయన, యూఎస్ లో ప్రస్తుతం ఈ వ్యాక్సిన్ మూడవ దశ ట్రయల్స్ జరుగుతున్నాయని ఆయన అన్నారు. కరోనా వ్యాక్సిన్ విషయంలో ఆఖరి దశకు చేరుకున్న వ్యాక్సిన్ లలో ఇది కూడా వుందని ఆయన అన్నారు. అమెరికా ఇప్పటివరకూ అసాధ్యం అనుకున్న ఎన్నో పనులను చేసి చూపిందని, కరోనా వ్యాక్సిన్ విషయంలోనూ విజయం సాధిస్తామని అన్నారు.

ఇదిలావుండగా, అమెరికాలోని 80 నగరాల్లో 30 వేల మంది వాలంటీర్లపై ఆస్ట్రాజెనికా ఈ వ్యాక్సిన్ ను ప్రయోగించనుంది. 18 ఏళ్ల పైబడిన వివిధ జాతులు, సంస్కృతులు, దేశాలకు చెందిన వారు ఈ వాలంటీర్లలో ఉన్నారు. హెచ్ఐవీ వంటి వ్యాధులున్నవారిపైనా ఈ దశలో వ్యాక్సిన్ ను ప్రయోగించనున్నారు. అంతే కాదు... కరోనా సోకే ప్రమాదం అధికంగా ఉన్న వారిని కూడా చేర్చామని ఆస్ట్రాజెనికా ఓ ప్రకటనలో మీడియాకు వెల్లడించింది.

కాగా, జనవరి 2021లో వ్యాక్సిన్ ను ప్రజలకు అందించాలని అమెరికా కంకణం కట్టుకుని శరవేగంగా ప్రయత్నాలు చేస్తోంది. తొలి దశలో 30 కోట్ల డోస్ లను అందించేందుకు ఏర్పాట్లు చేస్తోంది. ప్రస్తుతం యూఎస్ లో ఆక్స్ ఫర్డ్-ఆస్ట్రాజేనికా వ్యాక్సిన్ తో పాటు మోడెర్నా, ఫైజర్ సంస్థలు అభివృద్ధి చేస్తున్న టీకాలు కూడా ప్రయోగ దశలో ఉన్నాయి.


More Telugu News