మావోయిస్టు అగ్రనేత గణపతికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చిన పోలీసులు!  

  • గణపతితో పాటు వేణుగోపాల్ కూడా లొంగిపోనున్నట్టు మాకు సమాచారం వచ్చింది
  • లొంగుబాటు ప్రక్రియకు ద్వారాలు ఎప్పుడూ తెరిచే ఉంటాయి
  • ఎవరు లొంగిపోవాలనుకున్నా తమను సంప్రదించవచ్చు
మావోయిస్టు అగ్రనేత గణపతి (ముప్పాల లక్ష్మణరావ్) లొంగిపోనున్నట్టు వార్తలు వస్తున్నాయి. దీనిపై తెలంగాణ పోలీసుశాఖ స్పందించింది. గణపతి లొంగిపోవాలనుకుంటే తాము ఆయన నిర్ణయాన్ని స్వాగతిస్తామని చెప్పారు. ఆయన బంధువులు, మిత్రులు లేదా ఎవరి ద్వారా లొంగిపోవాలనుకున్నా తాము పూర్తిగా సహకరిస్తామని తెలిపారు. లొంగుబాటు ప్రక్రియకు ద్వారాలు ఎప్పుడూ తెరిచే ఉంటాయని చెప్పారు.

గతంలో జంపన్న, సుధాకర్ లాంటి వారు లొంగిపోవాలనుకున్నప్పుడు ఎలా సహకరించామో... గణపతి విషయంలో కూడా అలాగే వ్యవహరిస్తామని పోలీసు అధికారులు తెలిపారు. మానవతా ధృక్పథంతో తాము పూర్తిగా సహాయ, సహకారాలను అందిస్తామని చెప్పారు. ప్రభుత్వం చేపట్టిన పునరావాస ప్రక్రియ కింద ఇప్పటి వరకు 1,137 మంది లొంగిపోయారని తెలిపారు. గణపతితో పాటు మరో నేత వేణుగోపాల్ కూడా లొంగిపోవడానికి సిద్ధంగా ఉన్నట్టు తమకు సమాచారం అందిందని... ఇతర మావోయిస్టులు ఎవరు లొంగిపోవాలనుకున్నా పోలీసుశాఖను సంప్రదించవచ్చని సూచించారు.


More Telugu News