ఇందిర హత్య తరువాత... తానే ప్రధాని అవుతాననుకున్న ప్రణబ్... రాజీవ్ రావడంతో పార్టీకి గుడ్ బై!

  • జర్నలిస్ట్ నుంచి రాష్ట్రపతి వరకూ ఎన్నో పదవులు అలంకరించిన ప్రణబ్
  • గాంధీ ఫ్యామిలీకి విధేయుడే అయినా, ఆగ్రహంతో దూరమైన సందర్భాలు కూడా
  • 1984లో కాంగ్రెస్ ను వీడి సొంత పార్టీ పెట్టుకున్న ప్రణబ్ ముఖర్జీ
ప్రణబ్ ముఖర్జీ... భారత రాజకీయాల్లో తనదైన ముద్ర వేసిన మహానేత. జర్నలిస్ట్ గా కెరీర్ ను ప్రారంభించి, రాష్ట్రపతి వరకూ ఎన్నో పదవులను అలంకరించిన అజాతశత్రువు. తిరుగులేని కాంగ్రెస్ వాదిగా, గాంధీ కుటుంబ విధేయుడిగా పేరున్న ఆయన కూడా ఒకప్పుడు అదే పార్టీపై ఆగ్రహాన్ని వ్యక్తం చేసి, దూరమైన సందర్భాలు కూడా ఉన్నాయి. ఇలా ఒకసారి కాదు... రెండుసార్లు జరిగింది. కాంగ్రెస్ లోని సీనియర్ నేతల కుటిల రాజకీయాలకు తమ అభిమాన నేత బలై పోయారని, లేకుంటే ఆయన ఏనాడో ప్రధాని అయ్యేవారని ప్రణబ్ అభిమానులు ఇప్పటికీ చెబుతుంటారు. 

ఆనాడు ఏం జరిగిందో ఓ మారు గుర్తు చేసుకుంటే... 1984లో ఇందిరా గాంధీ హత్య తరువాత, కాంగ్రెస్ లో సీనియర్ నేతగా ఉన్న ప్రణబ్ ముఖర్జీ, తానే పార్టీలో వారసుడినని, ప్రధాని పదవి తననే వరిస్తుందని భావించారు. వాస్తవానికి అక్టోబర్ 31, 1984న రాజీవ్ గాంధీతో కలిసి ప్రణబ్ ముఖర్జీ కోల్ కతాలో ఉన్నారు. ఇందిరపై కాల్పుల తరువాత కోల్ కతాలో ఉన్న రాజీవ్, ప్రణబ్ సహా పలువురిని న్యూఢిల్లీ చేర్చేందుకు ప్రత్యేక విమానాన్ని ఏర్పాటు చేశారు. వీరు వెళ్లేసరికి ఇందిర ఎయిమ్స్ లో చికిత్స పొందుతున్నారు. ఆమె ప్రాణాలను కాపాడేందుకు వైద్యలు చేసిన కృషి ఫలించలేదు. 

ఆపై గంటల వ్యవధిలో జరిగిన పరిణామాల నేపథ్యంలో కొందరు సీనియర్లు ఎంతో చిన్నవాడైన రాజీవ్ గాంధీ పేరును తెరపైకి తెచ్చారు. ఆయన ప్రధాని అయితేనే పార్టీ ఏకతాటిపై ఉంటుందన్న వాదనను లేపారు. రాజీవ్ గాంధీని ప్రధానిగా పార్టీ ఎన్నుకోగానే, ఆగ్రహంతో ఉన్న ప్రణబ్ కాంగ్రెస్ కు రాజీనామా చేసేశారు. ఆపై రాష్ట్రీయ సమాజ్ వాదీ కాంగ్రెస్ పేరిట సొంత కుంపటి పెట్టుకున్నారు. 

అయితే, ఇందిరా గాంధీ హత్యతో దేశవ్యాప్తంగా వీచిన సానుభూతి పవనాలు ప్రణబ్ ఆశలను అడియాసలు చేశాయి. రాజీవ్ రెండోసారి ప్రధాని అయిన తరువాత ప్రణబ్ సత్తాను గుర్తించిన ఆయన, తిరిగి పార్టీలోకి ఆహ్వానించారు. ఆపై 1991లో రాజీవ్ హత్యకు గురైన తరవాత కూడా ప్రధాని పదవిని మరోసారి ఆశించి ప్రణబ్ భంగపడ్డారు. ఈ దఫా ఆయనకు పీవీ నరసింహరావు రూపంలో ప్రత్యర్థి ఎదురయ్యారు. 

తనకు నమ్మకంగా ఉండాలని, విధేయుడిగా ఉండే వ్యక్తినే ప్రధానిని చేయాలని సోనియా భావించడంతో ప్రణబ్ కు ఆ ప్రధాని పదవి మరోసారి దూరమైంది. అయితే, ఈ దఫా ఆయన కాంగ్రెస్ ను వీడలేదు. తన విధేయతను చాటుకుని రాష్ట్రపతి పదవిని స్వయంగా సోనియా గాంధీ ఆఫర్ చేసేంతగా ఎదిగారు. రాష్ట్రపతి భవన్ ను సామాన్యులకు కూడా దగ్గర చేసి, తనదైన ముద్ర వేసుకున్నారు.


More Telugu News