వైద్యులు సర్వశక్తులు ధారపోసినా ప్రణబ్ మృతి చెందడం దురదృష్టకరం: సీఎం కేసీఆర్

  • మాజీ రాష్ట్రపతి ప్రణబ్ కన్నుమూత
  • తీవ్ర దిగ్భ్రాంతికి గురైనట్టు కేసీఆర్ వెల్లడి
  • తెలంగాణ అంశంతో ప్రణబ్ కు ప్రత్యేక అనుబంధం ఉందని వెల్లడి
మాజీ రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ మృతి చెందడం పట్ల తెలంగాణ సీఎం కేసీఆర్ తీవ్ర దిగ్భ్రాంతికి గురయ్యారు. గత కొన్నివారాలుగా వైద్యులు శక్తివంచన లేకుండా శ్రమించినా ప్రణబ్ తుదిశ్వాస విడవడం దురదృష్టకరమని కేసీఆర్ పేర్కొన్నారు. తీవ్ర అనారోగ్యానికి గురై చికిత్స పొందుతున్న మాజీ రాష్ట్రపతి ప్రాణాలు కాపాడేందుకు చేసిన ప్రయత్నాలు విజయవంతం కాలేదని తెలిపారు.

తెలంగాణ అంశంతో ప్రణబ్ ముఖర్జీకి ప్రత్యేక అనుబంధం ఉందని, నాడు ప్రత్యేక తెలంగాణ అంశంపై యూపీఏ ప్రభుత్వం ఏర్పాటు చేసిన కమిటీకి ప్రణబ్ ముఖర్జీనే నాయకత్వం వహించారని కేసీఆర్ గుర్తుచేశారు. తెలంగాణ రాష్ట్ర బిల్లు ఆమోదం పొందడంలో ఆయన ఘనత కూడా ఉందన్నారు. ప్రత్యేక తెలంగాణ డిమాండ్ లో న్యాయం ఉందని చెప్పేవారని, ఈ దిశగా ఎన్నో విలువైన సూచనలు కూడా ఇచ్చారని తెలిపారు.

అంతేకాకుండా, కొద్దిమంది నాయకులకు మాత్రమే ఉద్యమాన్ని ఆరంభించే అవకాశం, దాని అంతిమ ఫలితాలు చూసే అవకాశం దక్కుతుందని చెప్పేవారని, ఆ అవకాశం మీకు దక్కిందని తనతో అనేవారని కేసీఆర్ గుర్తుచేసుకున్నారు.


More Telugu News