వీళ్లు పెద్దిరెడ్డి మనుషులు... ఎలా విధ్వంసానికి పాల్పడ్డారో చూడండి: నారా లోకేశ్

  • రాజకీయ రంగు పులుముకున్న ఓం ప్రతాప్ మరణం
  • ట్విట్టర్ లో వీడియో పోస్టు చేసిన లోకేశ్
  • పత్రికా స్వేచ్ఛను కాపాడాలంటూ వ్యాఖ్యలు
చిత్తూరు జిల్లాలో ఓం ప్రతాప్ అనే వ్యక్తి మరణం రాజకీయ దుమారం రేపుతోంది. ఈ నేపథ్యంలో టీడీపీ ఎమ్మెల్సీ నారా లోకేశ్ ట్విట్టర్ లో ఓ వీడియో పంచుకున్నారు. ఓం ప్రతాప్ మరణంపైనా, వైసీపీ ఇసుక మాఫియాపైనా నిజాలు బహిర్గతం చేసినందుకు వెంకట నారాయణ అనే జర్నలిస్టు ఇంటిపై పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి మనుషులు దాడి చేసి, విధ్వంసానికి పాల్పడ్డారని లోకేశ్ ఆరోపించారు. ఆ గూండాలు జర్నలిస్టు కుటుంబాన్ని పెట్రోల్ పోసి సజీవదహనం చేస్తామని బెదిరించారని వెల్లడించారు. ఈ విధమైన దాడిని చూస్తుంటే దిగ్భ్రాంతి కలుగుతోందని పేర్కొన్నారు.

దుండగుల బీభత్సం కారణంగా ఆ జర్నలిస్టు కుటుంబ సభ్యులు తలుపులు వేసుకుని ఇంట్లోనే భయంతో గడిపారని, పత్రికా స్వేచ్ఛపై జరుగుతున్న భయానక దాడుల్లో ఇదొకటని లోకేశ్ వివరించారు. అధికార పక్షం వ్యవస్థాగత ఉగ్రవాదానికి పాల్పడుతోందన్న దానికి ఇది నిదర్శనమని తెలిపారు. ఇది పూర్తిగా అన్యాయం అని లోకేశ్ ట్విట్టర్ లో స్పందించారు.

ఈ కిరాతక దాడులను తాను ఖండిస్తున్నానని, రాజకీయ జోక్యానికి తావులేని విధంగా దుండగులను శిక్షించాలని డిమాండ్ చేశారు. ఎటువంటి పరిస్థితులలోనైనా పత్రికా స్వేచ్ఛను పరిరక్షించాలని ఆయన అన్నారు.



More Telugu News