ఎన్టీఆర్ కొత్త చిత్రంపై అప్ డేట్ ఇచ్చిన నిర్మాత

  • ప్రస్తుతం 'ఆర్ఆర్ఆర్'ను పూర్తిచేస్తున్న ఎన్టీఆర్
  • తదుపరి చిత్రం త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలో
  • త్వరలోనే పెద్ద విశేషాన్ని చెబుతామన్న నిర్మాత
ప్రస్తుతం రాజమౌళితో 'ఆర్ఆర్ఆర్' చిత్రాన్ని చేస్తున్న ఎన్టీఆర్ దీని తరవాత త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలో రూపొందే చిత్రంలో నటించనున్నాడు. ఈ లాక్ డౌన్ సమయంలో దీనికి సంబంధించిన పూర్తి స్క్రిప్టు పని పూర్తిచేశారు. అలాగే ప్రీ ప్రొడక్షన్ పనులు కూడా ముమ్మరంగా సాగుతున్నాయి.

ఇది ఎన్టీఆర్ నటించే 30వ చిత్రం కావడంతో దీనికి అభిమానుల్లో ఓ ప్రత్యేకత ఏర్పడింది. అలాగే, త్రివిక్రమ్ తో చేస్తున్న చిత్రం కావడం కూడా ప్రాజక్టుకి క్రేజ్ తెచ్చింది. ఇక దీని గురించి మీడియాలో రకరకాల వార్తలు వస్తుండడంతో.. అభిమానులకు క్లారిటీ ఇవ్వడం కోసం చిత్ర నిర్మాతల్లో ఒకరైన నాగ వంశీ తాజాగా ట్విట్టర్ ద్వారా స్పందించారు.

'సినిమా గురించిన అప్ డేట్ చెప్పమంటూ యంగ్ టైగర్ తారక్ అన్న అభిమానుల నుంచి ఎన్నో మెసేజ్ లను అందుకుంటున్నాం. షూటింగును ఎప్పుడైతే మొదలెడతామో అప్పుడు ప్రతిఒక్కటీ వెల్లడిస్తాం. అప్పటివరకు సినిమా టైటిల్ని ప్రకటించకూడదన్నది మా సెంటిమెంట్. మా మీద విశ్వాసం వుంచండి, త్వరలోనే మీ ముందుకు పెద్ద విశేషాన్ని తీసుకువస్తాం' అంటూ ఆయన పేర్కొన్నారు.  


More Telugu News