170 రోజుల తరువాత... హైదరాబాద్ లో తిరిగి తెరచుకోనున్న బార్లు!

  • అన్ లాక్ 4.0 నిబంధనలు జారీ చేసిన కేంద్రం
  • అందుకు తగ్గట్టుగా బార్లను అనుమతించనున్న రాష్ట్రం
  • భౌతిక దూరం, శానిటైజేషన్ తప్పనిసరి చేస్తామన్న బార్ల యాజమాన్యం
  • లైసెన్స్ రెన్యువల్ సమయాన్ని ఆరు నెలలు పొడిగించాలని విన్నపం
రేపటి నుంచి అన్ లాక్ 4.0 ప్రారంభం కానుండగా, కేంద్ర ప్రభుత్వం ప్రకటించిన విధి విధానాల మేరకు హైదరాబాద్ లోని బార్ అండ్ రెస్టారెంట్లు కూడా తిరిగి ప్రారంభం కానున్నాయి. దాదాపు 170 రోజుల తరువాత బార్ల ప్రారంభానికి రాష్ట్ర ప్రభుత్వం అనుమతి ఇవ్వాలని నిర్ణయించుకోవడంతో, ఈ ఆరు నెలల్లో ఏర్పడిన నష్టాన్ని భర్తీ చేసుకునేందుకు బార్ అండ్ రెస్టారెంట్ల యాజమాన్యాలు సిద్ధమవుతున్నాయి.

మార్చిలో మూతపడిన తరువాత, చాలా వరకూ రెస్టారెంట్లు ఫుడ్ డెలివరీలతో పాటు, నిబంధనలను పాటిస్తూ అక్కడే కూర్చుని తినే సదుపాయాన్ని కూడా కల్పించాయి. ఈ రెస్టారెంట్ల ఆదాయంలో దాదాపు 80 శాతం లిక్కర్ సర్వ్ వల్లే వస్తుంది. అయితే, మద్యం సరఫరాకు అనుమతులు లేకపోవడంతో ఇవన్నీ నష్టాల బారిన పడ్డాయి.

"మేము రాష్ట్ర ప్రభుత్వం నుంచి వచ్చే విధి విధానాల గురించి ఎదురు చూస్తున్నాం. కొవిడ్-19 నిబంధనలన్నీ పాటించేలా ఏర్పాట్లు చేస్తున్నాం. గతంలోలా వచ్చినంత మంది కస్టమర్లను రానిచ్చే పరిస్థితులు ఇప్పుడు లేవు. శానిటైజేషన్ ప్రొటోకాల్, భౌతిక దూరం తప్పనిసరి చేయనున్నాం" అని క్లబ్ 8, క్లబ్ రోగ్ తదితర బార్ల చెయిన్ ను నిర్వహిస్తున్న నర్సింగ్ రావు వ్యాఖ్యానించారు. డిసెంబర్ నుంచి వ్యాపారం పుంజుకుంటుందని అంచనా వేస్తున్నట్టు ఆయన తెలిపారు.

ఇక, ఇప్పటికే తామెంతో నష్టపోయినందున బార్ అండ్ రెస్టారెంట్ల లైసెన్స్ రెన్యువల్స్ నిబంధనలను సడలించాలని వాటి యజమానులు కోరుతున్నారు. వాస్తవానికి రాష్ట్రంలో సెప్టెంబర్ 30న బార్ల లైసెన్స్ లు రెన్యువల్ చేయించుకోవాల్సి వుంటుంది. ఇప్పటికే ఆరు నెలల ఆదాయం కోల్పోయినందున, మరో ఆరు నెలల తరవాతే రెన్యువల్స్ చేసుకునేందుకు అనుమతించాలని, ఈ మేరకు రాష్ట్ర ఎక్సైజ్ శాఖ నిర్ణయం తీసుకుని, తమకు వెసులుబాటు కల్పించాలని కోరుతున్నారు.


More Telugu News