రియా చక్రవర్తికి మద్దతుగా మంచు లక్ష్మి, తాప్సీ కీలక వ్యాఖ్యలు!

  • సుశాంత్ ఆత్మహత్య తరువాత రియాపై ఆరోపణలు
  • మీడియా రియాను దోషిగా చూపుతోంది
  • నిజం తేలకుండా నిందలు వేయడం తగదు
  • సోషల్ మీడియాలో లక్ష్మి, తాప్సీ 
సుశాంత్ సింగ్ రాజ్ పుత్ ఆత్మహత్య తరువాత, నటి రియా చక్రవర్తిపై పలు ఆరోపణలు వచ్చిన సంగతి తెలిసిందే. అయితే, అనూహ్యంగా ఆమెకు మద్దతిచ్చే వారి సంఖ్య కూడా పెరుగుతోంది. తాజాగా మంచు లక్ష్మి, తాప్సీ కలసి రియాకు అనుకూలంగా మాట్లాడారు. తాను రియా చక్రవర్తి ఇంటర్వ్యూను చూశానని వ్యాఖ్యానించిన మంచు లక్ష్మి, 'జస్టిస్ ఫర్ రియా చక్రవర్తి' అనే హ్యాష్ ట్యాగ్ తో ఓ పోస్టును పెట్టారు.

"రియా చక్రవర్తి, రాజ్ దీప్ సర్దేశాయ్ ఇంటర్వ్యూను నేను పూర్తిగా చూశాను. దీనిపై నేను స్పందించాలా?వద్దా? అని ఎంతో ఆలోచించాను. రియాను ఇప్పటికే మీడియా ఓ రాక్షసిగా చిత్రీకరించింది. దీనిపై చాలామంది పెద్దలు మౌనంగా ఉన్నారు. నేను నిజం తెలుసుకోవాలని అనుకుంటున్నాను. నిజం బయటకు వస్తుందని నమ్ముతున్నాను. భారత న్యాయ వ్యవస్థపై నాకెంతో నమ్మకం ఉంది.

అలాగే, సుశాంత్ సింగ్ కు కూడా న్యాయం జరగాలి. అప్పటివరకూ అందరమూ సహనంతో ఉండాల్సిన అవసరం ఉంది. నిజానిజాలు తెలియకుండా రియా కుటుంబంపై నిందలను వేయవద్దు. ఈ సమయంలో రియా ఫ్యామిలీ ఎంతగా బాధను అనుభవిస్తుందో నేను ఊహించగలను. ఒకవేళ నాకే ఇటువంటి పరిస్థితి ఎదురైతే, నా సహచరులు మద్దతుగా ఉండాలని కోరుకుంటాను. కనీసం నిజం వెలుగులోకి వచ్చేంత వరకైనా రియాను ఒంటరిగా వదిలేయండి. ఈ క్లిష్ట సమయంలో నేను రియాకు మద్దతుగా నిలుస్తున్నాను" అని మంచు లక్ష్మి తన పోస్టులో పేర్కొన్నారు.

ఇక హీరోయిన్ తాప్సీ స్పందిస్తూ, తనకు సుశాంత్ తోనూ, రియాతోనూ పెద్దగా పరిచయాలు లేవని, అయితే, నేరం రుజువు కాకముందే ఓ వ్యక్తిని దోషిగా చూపే ప్రయత్నాలు చేయడం చాలా తప్పని వ్యాఖ్యానించింది. చట్టాన్ని ప్రతి ఒక్కరూ నమ్మాలంటూ ట్వీట్ చేసింది.


More Telugu News