ఊబకాయంతో బాధపడుతున్న దోషి... ఇలాంటివాడ్ని జైలుకు పంపలేమన్న జడ్జి

  • చిన్నారులపై లైంగిక అఘాయిత్యాలకు పాల్పడిన టీచర్
  • కోర్టులో దోషిగా తేలిన వైనం
  • ఇలాంటి వ్యక్తిని జైలుకు పంపితే అధిక వ్యయం తప్పదన్న కోర్టు
ఆస్ట్రేలియాలోని పీటర్ జాన్ ఓనీల్ (61) అనే వ్యక్తి గతంలో టీచర్ గా విధులు నిర్వర్తించాడు. అయితే, ఆరుగురు చిన్నారులపై లైంగిక వేధింపులకు పాల్పడినట్టు అతడిపై ఆరోపణలు రాగా, కోర్టులో అతడి నేరాలు నిరూపితమయ్యాయి. జడ్జి పీటర్ జాన్ ఓనీల్ ను దోషిగా నిర్ధారించారు. అయితే, అతడ్ని జైలుకు పంపడం వీలుకాని పని అంటూ వ్యాఖ్యానించారు.

అందుకు కారణం, ఆ కీచకుడు అతి భారీకాయంతో ఉండడమే. తనకు తానుగా నడవలేనంత అధికబరువుతో బాధపడుతున్నాడు. ఊబకాయం కారణంగా వీల్ చైర్ కే పరిమితమయ్యాడు. ఇలాంటి వ్యక్తిని జైలుకు పంపితే ఖర్చు తడిసి మోపెడవుతుందని న్యాయమూర్తి భావించారు. వీల్ చైర్ లో ఉన్న వ్యక్తి కాబట్టి హెలికాప్టర్ అంబులెన్స్ లో జైలుకు తరలించాల్సి ఉంటుందని, పైగా జైల్లో ప్రత్యేక సౌకర్యాలు ఏర్పాటు చేయాల్సి ఉంటుందని, అన్నీ కలిపి రూ.30 లక్షలు ఖర్చవుతాయని లెక్కలు వేశారు. ఆపై, పీటర్ జాన్ ఓనీల్ ను జైలుకు పంపేందుకు నిరాకరించారు.

అయితే అతనికి శిక్ష ఎలా అమలు చేయాలన్నదానిపై తదుపరి విచారణలో తీర్పు వెల్లడిస్తామని జడ్జి పేర్కొన్నారు. తాము తుది తీర్పు వచ్చే వరకు ఓనీల్ ఇంటికే పరిమితమవ్వాలని కోర్టు ఆదేశించింది. అయితే అతడు ఎలాగూ కదల్లేడు కాబట్టి, అతడి ఇంటి వద్ద పోలీసు కాపలా అవసరంలేదని ధర్మాసనం పేర్కొంది.


More Telugu News