మాతృభాషపై ప్రేమ పెంచుకోవడం అంటే ఇతర భాషలు నేర్చుకోవద్దని కాదు: ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు

  • తెలుగు భాషా దినోత్సవం సందర్భంగా వెంకయ్య వ్యాఖ్యలు
  • పలు భాషలు అంతరించే ప్రమాదంలో పడ్డాయని వెల్లడి
  • వాటిని కాపాడుకోవాల్సిన అవసరం ఉందంటూ ట్వీట్లు
తెలుగు భాషా దినోత్సవం సందర్భంగా ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు ట్విట్టర్ లో స్పందించారు. తెలుగు నాట భాషోద్యమానికి శ్రీకారం చుట్టిన బహుముఖ ప్రజ్ఞాశాలి గిడుగు రామ్మూర్తి పంతులు జయంతి సందర్భంగా తెలుగు భాషా దినోత్సవాన్ని జరుపుకుంటున్న సంగతి తెలిసిందే. దీనిపై వెంకయ్యనాయుడు వ్యాఖ్యానిస్తూ, విజ్ఞానం అందరికీ అందాలనే ఉద్దేశంతో గిడుగు రామ్మూర్తి వ్యవహారిక భాషోద్యమానికి శ్రీకారం చుట్టారని, పుస్తకాల్లో సులభమైన భాషను వాడాలని ఉద్యమించారని, తద్వారా తెలుగు భాష అభివృద్ధిని కాంక్షించారని వివరించారు. మాతృభాషను కాపాడుకోవడమే వారికి అందించే ఘనమైన నివాళి అని పేర్కొన్నారు.

ఆదర్శవంతమైన సమాజ నిర్మాణానికి భాష, సంస్కృతులే పునాది అని వెంకయ్య స్పష్టం చేశారు. అయితే ప్రపంచకీకరణ నేపథ్యంలో పలు భాషలు అంతరించే ప్రమాదంలో పడ్డాయని, వాటిని కాపాడుకోవాల్సిన అవసరం ఉందని తెలిపారు. మాతృభాషకు ప్రాధాన్యం ఇస్తున్న ఫ్రాన్స్, జర్మనీ, స్వీడన్, జపాన్, ఇటలీ, బ్రెజిల్, రష్యా వంటి దేశాల ఒరవడిని ఆదర్శంగా తీసుకోవాలని పిలుపునిచ్చారు.

పురోభివృద్ధిని కోరుకునేవారు పూర్వవృత్తాన్ని మరువరాదన్న పెద్దల మాటను ఆదర్శంగా తీసుకుని, మన కట్టు, బొట్టు, భాష, యాస, మన పండుగలు, పబ్బాలు అన్నింటిని గౌరవించుకుని సంస్కృతిని పరిరక్షించుకోవాలని, ముందు తరాలకు అందించాలని సూచించారు.

అయితే, మాతృభాష పట్ల ప్రేమ పెంచుకోవడం అంటే ఇతర భాషలు నేర్చుకోవద్దని భావించరాదని, అన్ని భాషలు నేర్చుకుని మాతృభాషను మనసులో నింపుకోవాలని వివరించారు. భాష ద్వారా మంచి సంస్కృతి, తద్వారా ఆదర్శవంతమైన సమాజ నిర్మాణం దిశగా ప్రతి ఒక్కరూ చొరవ తీసుకోవాలని ఆకాంక్షిస్తున్నానంటూ ఆయన ట్విట్టర్ లో స్పందించారు.


More Telugu News