రాయలసీమ ఎత్తిపోతల పథకంపై ఎన్జీటీ విచారణ సెప్టెంబరు 3కి వాయిదా

  • ఎన్జీటీ చెన్నై బెంచ్ లో నేడు విచారణ
  • రెండు గంటల పాటు వాదనలు వినిపించిన తెలంగాణ అడిషనల్ ఏజీ
  • ఏపీ తప్పుదోవ పట్టిస్తోందంటూ ఆరోపణలు
ఏపీ, తెలంగాణ రాష్ట్రాల మధ్య ప్రాజెక్టుల విషయంలో ఏకాభిప్రాయం కుదరడంలేదు. తాజాగా, ఏపీ చేపడుతున్న రాయలసీమ ఎత్తిపోతల పథకానికి పర్యావరణ అనుమతులు లేవు అంటూ తెలంగాణ ప్రభుత్వం దాఖలు చేసిన పిటిషన్ పై నేషనల్ గ్రీన్ ట్రైబ్యునల్ (ఎన్జీటీ) చెన్నై బెంచ్ విచారణ చేపట్టింది. తెలంగాణ తరఫున అడిషనల్ ఏజీ రామచంద్రరావు వాదనలు వినిపించారు. రాయలసీమ ఎత్తిపోతల పథకానికి పర్యావరణ అనుమతులు అవసరమని తెలంగాణ ప్రభుత్వం ఈ సందర్భంగా పేర్కొంది.

ప్రాజెక్టు సామర్థ్యం 40 వేల క్యూసెక్కుల నుంచి 80 వేల క్యూసెక్కులకు రెట్టింపు చేశారని ఆరోపించింది. ఈ ప్రాజెక్టుకు పర్యావరణ అనుమతులు అవసరంలేదని కమిటీ ఇచ్చిన నివేదికను పక్కనబెట్టాలని తెలంగాణ ఎన్జీటీని కోరింది. ఏపీ చెప్పినవాటినే విని నిపుణుల కమిటీ ఏకపక్షంగా నివేదిక ఇచ్చిందని ఆరోపించింది. అవసరమైతే కమిటీ సభ్యులను హెలికాప్టర్ లో తీసుకెళ్లి ప్రాజెక్టు చూపిస్తామని వెల్లడించింది.

ప్రాజెక్టులో భారీ మార్పులు చేసిన ఏపీ, ప్రాజెక్టు గతంలో ఉన్న విధంగానే ఉందని తప్పుదోవ పట్టిస్తోందని పేర్కొంది. రాయలసీమ ఎత్తిపోతల పథకం సామర్థ్యం పెంచితే తెలంగాణకు తీవ్ర నష్టం వాటిల్లుతుందని, రాష్ట్రానికి ఇది జీవన్మరణ సమస్య అని అదనపు ఏజీ ఈ సందర్భంగా వాదించారు. దాదాపు రెండు గంటల పాటు ఆయన తమ వాదనలు వినిపించారు. అనంతరం ఎన్జీటీ దీనిపై తదుపరి విచారణను సెప్టెంబరు 3కి వాయిదా వేసింది.


More Telugu News