విశాఖ తొట్లకొండ ప్రాంతంలో ఉన్న బౌద్ధారామాన్ని పరిరక్షించుకోవాల్సిన అవసరం ఉంది: రఘురామకృష్ణరాజు

  • విశాఖ బౌద్ధారామం పరిస్థితిపై రఘురామ ఆందోళన
  • దీనిపై కేంద్రంతో మాట్లాడానని వెల్లడి
  • బౌద్ధారామం ప్రాంతంలో రాష్ట్రం నిర్మాణాలు చేపట్టరాదన్న రఘురామ
విశాఖ తొట్లకొండ ప్రాంతంలో ఉన్న బౌద్ధారామాన్ని పరిరక్షించుకోవాల్సిన అవసరం ఉందని నరసాపురం ఎంపీ రఘురామకృష్ణరాజు అభిప్రాయపడ్డారు. ఇవాళ ఆయన ఢిల్లీలో మీడియాతో మాట్లాడుతూ, తొట్లకొండ ప్రాంతంలో ఇతర నిర్మాణాలు చేపడితే అక్కడి చారిత్రక ప్రాశస్త్యం అంతరించిపోతుందని, ఈ విషయంలో తాను కేంద్రంతో కూడా మాట్లాడానని వెల్లడించారు.

ఈ ప్రాంతంలో ఉన్న బౌద్ధారామం వంటి ఆకృతులే ఇండోనేషియాలోని గోడో బుదూర్ అనే ప్రాంతంలో ఉన్నాయని, వాటికి అక్కడ ఎంతో ప్రాధాన్యత లభిస్తోందని, మనం కూడా మన ప్రాంతంలో ఉన్న బౌద్ధారామాన్ని కాపాడుకోవాలని పిలుపునిచ్చారు.

ఈ ప్రాంతం కేంద్ర ఆర్కియాలజీ విభాగం పరిధిలో ఉందా, లేక రాష్ట్ర ఆర్కియాలజీ పరిధిలో ఉందా అని సంబంధిత కేంద్రమంత్రిని అడిగానని, ఆయన ద్వారా తెలిసింది ఏంటంటే, దురదృష్టవశాత్తు ఇప్పుడు నిర్మాణాలు జరగబోతున్న స్థలం రాష్ట్ర ఆర్కియాలజీ పరిధిలో ఉందని వెల్లడైందని రఘురామకృష్ణరాజు వివరించారు. ఎంతో చారిత్రక, సాంస్కృతిక ప్రాముఖ్యత ఉన్న ప్రదేశంలో రాష్ట్ర ప్రభుత్వమే నిర్మాణం చేపడితే కంచే చేను మేసినట్టు అవుతుందని అన్నారు.

నిర్మాణాలు కొనసాగేట్టయితే, ఈ ప్రాంతాన్ని ఆర్కియాలజీ సర్వే ఆఫ్ ఇండియా (ఏఎస్ఐ) పరిధిలోనికి తీసుకోవాలని కేంద్రమంత్రిని కోరారని, ఆయన సానుకూలంగా స్పందించారని తెలిపారు. విశాఖలో ఎలాంటి తప్పు జరిగినా, ముందుండి ప్రభుత్వాల దృష్టికి తీసుకువస్తున్న భారత ప్రభుత్వ మాజీ కార్యదర్శి ఈఏఎస్ శర్మ గారికి కృతజ్ఞతలు తెలుపుకుంటున్నానని పేర్కొన్నారు.


More Telugu News