ధోనీ చెప్పిన ఒక్క మాట... సీఎస్కే సీఈఓను కన్విన్స్ చేసింది!

  • దుబాయ్ కి వెళ్లే ముందు చెన్నైలో శిక్షణ
  • బయో బబుల్ ను ఇక్కడే అలవాటు చేద్దామన్న ధోనీ
  • ట్రయినింగ్ క్యాంప్ ను నిర్వహించని ఇతర ఫ్రాంచైజీలు
ఐపీఎల్ పోటీల నిమిత్తం దుబాయ్ కి బయలుదేరే ముందు మూడు సీజన్ లలో ఐపీఎల్ ట్రోఫీని తన జట్టు చెన్నై సూపర్ కింగ్స్ కు అందించిన ఎంఎస్ ధోనీ, ఐదు రోజుల పాటు ఆటగాళ్లకు శిక్షణా క్యాంపును చెన్నైలో ఏర్పాటు చేశారు. కరోనా మహమ్మారి విస్తరిస్తున్న నేపథ్యంలో మరే ఫ్రాంచైజీ కూడా ఈ సాహసం చేయలేకపోయింది. తాజాగా ఎవరూ ట్రయినింగ్ క్యాంప్ పెట్టే ధైర్యం చేయలేని వేళ, తామెందుకు పెట్టామన్న విషయాన్ని సీఎస్కే సీఈఓ కాశీ విశ్వనాథన్ వెల్లడించారు. ధోనీ తన మాటతో కన్విన్స్ చేశాడని తెలిపారు.

"టోర్నమెంట్ జరుగుతుందని ప్రకటన వెలువడగానే, ప్రాక్టీస్ పై ఆలోచనలో పడ్డాము. బయో బబుల్ (వైరస్ సోకని విధంగా రక్షిత వాతావరణం) ను క్రియేట్ చేయాలంటే కష్టం. దుబాయ్ కి వెళ్లే ముందు క్యాంప్ పై ధోనీతో మాట్లాడాను. ఈ విషయంలో ధోనీ ఎంతో స్పష్టతతో ఉన్నారు. 'మనం నాలుగైదు నెలల నుంచి ఆడలేదు. అందరూ చెన్నైలోనే కలవాలని ఏమీ లేదు. బయో బబుల్ ను చెన్నైలోనే ఆటగాళ్లకు అలవాటు చేయాలి. అప్పుడు దుబాయ్ కి వెళ్లగానే ఇక్కడి అనుభవం ఉపయోగపడుతుంది' అని ధోనీ చెప్పగానే, ట్రయినింగ్ క్యాంప్ కు అనుమతించాం" అని విశ్వనాథన్ వ్యాఖ్యానించారు.

ఈ ట్రయినింగ్ క్యాంప్, ఆటగాళ్లు మానసికంగా సిద్ధపడేందుకు సహకరించిందని, క్యాంప్ ను విజయవంతంగా నిర్వహించినందుకు తనకెంతో ఆనందంగా ఉందని చెబుతూ ఓ వీడియోను ఆయన విడుదల చేశారు. కాగా, ఈ క్యాంపుకి ధోనీ, రైనా, మురళీ విజయ్, దీపక్ చావ్లా, అంబటి రాయుడు, శార్దూల్ ఠాకూర్ తదితరులు హాజరయ్యారు. హర్భజన్ సింగ్, రవీంద్ర జడేజాలు మాత్రం వ్యక్తిగత కారణాలతో హాజరు కాలేదు.


More Telugu News