కరోనా అసాధారణ దైవఘటన... ఈ మహమ్మారి ఆర్థిక వ్యవస్థను దెబ్బతీస్తుంది: నిర్మలా సీతారామన్
- భారత్ లో కరోనా ఉద్ధృతి
- ఆర్థిక సంవత్సరంలో లోటుకు కారణమైందని వెల్లడి
- పన్నులు పెంపు ఆలోచన లేదని స్పష్టీకరణ
కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ కరోనా వైరస్ విజృంభణ నేపథ్యంలో ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. కరోనా వైరస్ వ్యాప్తిని ఒక అసాధారణ దైవఘటన అంటూ అభివర్ణించారు. దేశ ఆర్థిక వ్యవస్థను ఇది దెబ్బతీసే అవకాశం ఉందని, ఈ ఆర్థిక సంవత్సరంలో లోటుకు కారణమవడమే కాకుండా, దేశాభివృద్ధిని సైతం కుంటుపడేలా చేయగలదని పేర్కొన్నారు. అయితే ఎంతమేర నష్టపోతామన్నది చెప్పలేననని అన్నారు. అంతేకాకుండా, ఈ ఏడాది రూ.2.35 లక్షల కోట్ల మేర విస్తరించిన జీఎస్టీ ఆదాయం కూడా కరోనా మహమ్మారి ప్రభావానికి గురైందని, గతేడాదితో పోల్చితే రూ.70 వేల కోట్లు తగ్గిందని వివరించారు. అయితే కరోనా కారణంగా కలిగిన ఆర్థిక నష్టాలను భర్తీ చేసుకునేందుకు పన్నుల పెంపు ప్రతిపాదనేదీ లేదని ఆమె స్పష్టం చేశారు.