ఏపీలో కొనసాగుతున్న కరోనా విలయం... మరోసారి 10 వేలకు పైగా కొత్త కేసులు

  • ఒక్కరోజులో 92 మంది మృతి
  • 3,633కి పెరిగిన మొత్తం మరణాల సంఖ్య
  • తాజాగా 8,528 మంది డిశ్చార్జి
ఏపీలో కరోనా వైరస్ రక్కసి కోరలు చాచి విజృంభిస్తోంది. మరోసారి 10 వేలకు పైగా పాజిటివ్ కేసులు రాగా, గడచిన  24 గంటల్లో 92 మంది ఈ మహమ్మారికి బలయ్యారు. ఏపీలో తాజాగా 61,300 శాంపిల్స్ పరీక్షించగా, 10,621 మందికి పాజిటివ్ అని నిర్ధారణ అయింది. తూర్పుగోదావరి, ప్రకాశం జిల్లాల్లో వెయ్యికి పైగా కొత్త కేసులు గుర్తించారు.

రాష్ట్రంలో కరోనా మరణాల సంఖ్య ఆందోళనకర రీతిలో నమోదవుతోంది. అత్యధికంగా కర్నూలు జిల్లాలో 13 మంది, నెల్లూరు జిల్లాలో 11 మంది, తూర్పు గోదావరి జిల్లాలో 10 మంది కరోనాతో కన్నుమూశారు. చిత్తూరు, కడప, పశ్చిమ గోదావరి వంటి పలు జిల్లాల్లోనూ వైరస్ భూతం అనేకమంది ప్రాణాలను బలిగొంది.

తాజా బులెటిన్ ప్రకారం, రాష్ట్రంలో మొత్తం పాజిటివ్ కేసుల సంఖ్య 3,93,090కి చేరింది. మరో 8,528 మంది కరోనా నుంచి కోలుకున్నారు. తద్వారా ఇప్పటివరకు 2,95,248 మంది కరోనా బారి నుంచి విముక్తులయ్యారు. ఇంకా 94,209 మంది చికిత్స పొందుతున్నారు. ఇక, రాష్ట్రవ్యాప్తంగా నమోదైన మొత్తం మరణాల సంఖ్య 3,633కి పెరిగింది.


More Telugu News