1962 తర్వాత మళ్లీ అంత ఉద్రిక్త పరిస్థితి నెలకొంది.. ఇరు దేశాల సైన్యం పెద్ద సంఖ్యలో మోహరించింది: విదేశాంగ మంత్రి జైశంకర్

  • తూర్పు లడఖ్ ప్రాంతంలో పరిస్థితి ఉద్రిక్తంగా ఉంది
  • ఒప్పందాలను రెండు దేశాలు గౌరవిస్తేనే శాంతి సాధ్యం
  • చైనా సామరస్యపూర్వకంగా స్పందించాలి
ప్రస్తుతం చైనాతో నెలకొన్న పరిస్థితి చాలా ఉద్రిక్తంగా ఉందని భారత విదేశాంగ మంత్రి జైశంకర్ అన్నారు. తూర్పు లడఖ్ ప్రాంతంలో నెలకొన్న ఉద్రిక్తతలపై ఆయన స్పందిస్తూ... 1962 తర్వాత ఆ స్థాయిలో ఉద్రిక్త పరిస్థితులు నెలకొనడం ఇదే తొలిసారని వ్యాఖ్యానించారు. ప్రస్తుత పరిస్థితి చాలా ఆందోళనకరమని చెప్పారు. దశాబ్దాల తర్వాత చైనా సరిహద్దుల్లో మనం సైనికులను కోల్పోయామని తెలిపారు. గాల్వాన్ లోయలో చోటు చేసుకున్న పరిణామాల తర్వాత ఇరు దేశాలు భారీ సంఖ్యలో బలగాలను మోహరింపజేశాయని... ఇది ఊహించని పరిణామమని చెప్పారు.

ఇరు దేశాల అత్యున్నత సైనికాధికారుల మధ్య గత మూడున్నర నెలల సమయంలో పలు విడతలుగా చర్చలు జరిగినప్పటికీ... వాస్తవాధీనరేఖ వద్ద ఉద్రిక్త పరిస్థితులు కొనసాగుతూనే ఉన్నాయని జైశంకర్ అన్నారు. గతంలో చోటు చేసుకున్న చూమర్, డోక్లాం ఉద్రిక్తతలను ఇరు దేశాలు దౌత్యపరమైన చర్చల ద్వారా పరిష్కరించుకున్నాయని... కానీ, ప్రస్తుత పరిస్థితి వాటికి విరుద్ధంగా ఉందని తెలిపారు. అయినప్పటికీ ప్రస్తుత ఉద్రిక్తతలకు దౌత్యపరంగా పరిష్కార మార్గం దొరుకుతుందనే ఆశాభావాన్ని ఆయన వ్యక్తం చేశారు. అయితే, రెండు దేశాల మధ్య కుదిరిన ఒప్పందాలను ఇరు దేశాలు గౌరవిస్తేనే ఇది సాధ్యమవుతుందని చెప్పారు.

ఉద్రిక్తతలను చల్లార్చేందుకు భారత్ పూర్తి స్థాయిలో యత్నిస్తోందని... మిలిటరీ పరమైన చర్చల ద్వారానే కాకుండా, దౌత్యపరంగా కూడా ప్రయత్నిస్తోందని జైశంకర్ తెలిపారు. అయితే చైనా సామరస్య పూర్వకంగా స్పందిస్తేనే ప్రస్తుత ఉద్రిక్తతలు చల్లారుతాయని చెప్పారు.


More Telugu News