ఫేస్‌బుక్ పలకరింతకు పొంగిపోయి.. రూ. 1.30 లక్షలు సమర్పించుకున్న మహిళ

  • కృష్ణా జిల్లా పెనమలూరులో ఘటన
  • హాయ్ చెప్పిన పాపానికి నిండా మునిగిన బాధితురాలు
  • డబ్బులు ఖాతాలో పడ్డాక స్విచ్చాఫ్
ఫేస్‌బుక్‌లో ‘హాయ్’ అంటూ తనకు వచ్చిన మెసేజ్‌కు రిప్లై ఇచ్చిన ఓ మహిళ రూ. 1.30 లక్షలు మోసపోయి పోలీసులను ఆశ్రయించింది. కృష్ణా జిల్లా పెనమలూరులో జరిగిందీ ఘటన. కానూరు మురళీనగర్‌కు చెందిన మహిళ స్థానికంగా కిరాణా దుకాణం నిర్వహిస్తూ జీవిస్తోంది. ఇటీవల ఆమె ఫేస్‌బుక్ ఖాతాకు ఓ వ్యక్తి నుంచి ‘హాయ్’ అని మెసేజ్ వచ్చింది. అది చూసిన ఆమె రిప్లై ఇచ్చింది. అలా ఇద్దరి మధ్య ఏర్పడిన పరిచయం ఫోన్‌లో మాట్లాడుకోవడం వరకు వెళ్లింది. తాను లండన్‌లో వైద్యుడిగా పనిచేస్తున్నట్టు నమ్మించిన సదరు వ్యక్తి.. ఆమె కోసం లండన్ నుంచి ఖరీదైన కానుకలను పంపుతున్నట్టు ఫోన్ చేసి చెప్పాడు.

చెప్పినట్టే ఈ నెల 2న మళ్లీ ఆమెకు ఫోన్ చేసిన నిందితుడు తాను పంపిన కానుకల పార్శిల్‌ను ఢిల్లీ ఎయిర్‌పోర్టులో కస్టమ్ అధికారులు పట్టుకున్నారని, రూ. 1.30 లక్షలు చెల్లిస్తేనే వాటిని విడిచిపెడతారని చెప్పాడు. అతడు మాటలు నమ్మిన మహిళ అతడు చెప్పిన బ్యాంకు ఖాతాల్లో విడతల వారీగా రూ. 1.30 లక్షలు జమచేసింది. అంతే, ఆ తర్వాతి నుంచి అతడి ఫోన్ స్విచ్ఛాఫ్ అయింది. మరోవైపు, కానుకల పార్శిల్ కూడా తనకు చేరకపోవడంతో అనుమానించిన ఆమె నిన్న పోలీసులకు ఫిర్యాదు చేసింది. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.


More Telugu News