ఓజోన్ గ్యాస్‌తో కరోనాకు చెక్: జపాన్ శాస్త్రవేత్తల వెల్లడి

  • తక్కువ సాంద్రత కలిగిన ఓజోన్ వాయువుతో కరోనా క్రియారహితం
  • 0.55 నుంచి 0.1 పీపీఎం స్థాయిలో ఉపయోగిస్తే ఫలితాలు
  • ఇప్పటికే ఓజోన్ జనరేటర్లను ఉపయోగిస్తున్న జపాన్
కరోనా వైరస్‌కు చెక్ పెట్టేందుకు ప్రపంచవ్యాప్తంగా విస్తృత పరిశోధనలు జరుగుతున్న వేళ జపాన్ శాస్త్రవేత్తలు ఓ ఆసక్తికర విషయాన్ని వెల్లడించారు. ఓజోన్ వాయువుతో వైరస్‌కు చెక్ పెట్టవచ్చని చెప్పారు. ఓజోన్ గ్యాస్‌ను మానవులకు హాని చేయనంత స్థాయిలోనే వైరస్‌ను చంపగలదని గుర్తించినట్టు పుజిటా హెల్త్ యూనివర్సిటీ శాస్త్రవేత్తలు తెలిపారు. తక్కువ సాంద్రత కలిగిన ఓజోన్ గ్యాస్‌కు వైరస్‌ను నిర్వీర్యం చేయగల శక్తి ఉందన్నారు. 0.05 నుంచి 0.1 పీపీఎం స్థాయిలో ఓజోన్ వాయువును ఉపయోగించి వైరస్‌ను నిర్వీర్యం చేయవచ్చన్నారు. ఆసుపత్రులు, పరీక్షా కేంద్రాల్లో దీనిని డిస్‌ఇన్‌పెక్టెంట్‌గా కూడా ఉపయోగించవచ్చని తెలిపారు.

మూసివున్న గదిలో శాస్త్రవేత్తలు ఈ ప్రయోగాన్ని నిర్వహించారు. ఇందులో ఓజోన్ జనరేటర్‌ను ఉపయోగించి దాదాపు 10 గంటలపాటు తక్కువ సాంద్రత కలిగిన ఓజోన్ వాయువును వాడారు. ఫలితంగా వైరస్ శక్తి 90 శాతం తగ్గినట్టు గుర్తించారు. ఓజోన్ ఒకరకమైన ఆక్సిజన్ అణువని, ఇది అనేక వ్యాధికారకాలను క్రియారహితం చేస్తుందని చీఫ్ సైంటిస్ట్ మురాఠా పేర్కొన్నారు.

అధిక తేమతో కూడిన పరిస్థితుల్లోనూ ఇది సమర్థంగా పనిచేస్తుందన్నారు. 1-6 పీపీఎం మధ్య అధిక సాంద్రత కలగిన ఓజోన్ వాయువు కరోనా వైరస్‌కు వ్యతిరేకంగా పనిచేస్తున్నా అది మానవులకు విషపూరితంగా మారే అవకాశం ఉందని గత ప్రయోగాలు వెల్లడించాయి. కాగా, జపాన్‌లోని ఐచి ప్రఫెక్చర్‌లోని ఫుజిటా మెడికల్ యూనివర్సిటీ ఓజోన్ జనరేటర్లను ఇప్పటికే ఏర్పాటు చేసి వైరస్ సంక్రమణను తగ్గించేందుకు కృషి చేస్తోంది.


More Telugu News